Share News

KCR: తిట్టడం కాదు.. ఆధారాలతో నిలదీద్దాం

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:10 AM

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజల పక్షాన గళం వినిపిద్దామని, రేవంత్‌రెడ్డి సర్కారును ఇరుకునపెట్టేలా సమస్యలపై నిలదీద్దామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.

KCR: తిట్టడం కాదు.. ఆధారాలతో నిలదీద్దాం

  • ఉభయసభల్లో సర్కారును ప్రశ్నిద్దాం

  • కాంగ్రెస్‌ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడదాం

  • పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం

  • బీఆర్‌ఎస్‌ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజల పక్షాన గళం వినిపిద్దామని, రేవంత్‌రెడ్డి సర్కారును ఇరుకునపెట్టేలా సమస్యలపై నిలదీద్దామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. అయితే సభలో అధికార, ప్రతిపక్షాలు తిట్టుకునేలా కాకుండా.. ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలకు కళ్లెం వేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, మూడోవంతు సమయం పూర్తయిందని పేర్కొన్నారు. హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన విధానం, హామీల అమల్లో కాంగ్రెస్‌ వైఫల్యం, బడ్జెట్‌లో ఆయా రంగాలకు జరిపే కేటాయింపులు, ఇతర అంశాలపై ఏ విధంగా స్పందించాలన్న దానిపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, రైతుల సమస్యలు, మంచినీటి కొరత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలతోపాటు ఇతర ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తాలని అన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ సభ్యులు దూకుడుగా వెళ్లాలని, రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి వివరించిన కేసీఆర్‌.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేేస్త.. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన 14 నెలల్లోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కారు భారీగా అప్పులు చేస్తున్నా.. ఎన్నికల హామీలు మాత్రం అమలు చేయడంలేదని ఆరోపించారు. రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


బీఆర్‌ఎ్‌సపై నిందలను తిప్పికొట్టాలి..

అప్పుల విషయంలో బీఆర్‌ఎ్‌సపై కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని, వేస్తున్న నిందలను బలంగా తిప్పికొట్టాలని, సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ సూచించారు. ప్రధానంగా.. ఎండిన పంటలు, అందని సాగునీరు, విద్యుత్తు, కాలిపోతున్న మోటార్లు వంటి రైతాంగ సమస్యలతోపాటు మంచినీటి కొరతపై అసెంబ్లీ, మండలిలో పోరాడాలన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ గొంతుక వినిపించాలన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, డీఏల పెండింగ్‌, పీఆర్సీ అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరిని, విద్యార్థుల ఓవర్సీస్‌ స్కాలర్‌షి్‌పల బకాయిలు, వైద్యరంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, ఇతర ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగటాలన్నారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలుపై ప్రశ్నించాలన్నారు. శాసనసభ, మండలిలో ప్రతిభావంతంగా ప్రజాసమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా.. డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.


అసెంబ్లీకి రానున్న కేసీఆర్‌..!

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరుకావడం లేదని విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో బుధవారం ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు, విమర్శలు చేయడంపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి, ‘‘మీ పార్టీ అధినేత అసెంబ్లీకి వేస్త అన్ని ఆరోపణలు, విమర్శలకు జవాబిస్తాం’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత సభకు హాజరైతే.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పక్ష నేతల విమర్శలను తిప్పికొట్టేలా ఈ బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు సారొస్తారంటూ.. గులాబీ శ్రేణులు ఘటాపథంగా చెబుతున్నాయి. అయితే బడ్జెట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులూ కేసీఆర్‌ సభకు వస్తారా? తొలిరోజు గవర్నర్‌ ప్రసంగ సమావేశానికి, ఆ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు మాత్రమే హాజరవుతారా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు

Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..

Updated Date - Mar 12 , 2025 | 04:10 AM