Share News

Kaleshwaram Case: కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ..

ABN , Publish Date - Sep 02 , 2025 | 03:18 AM

కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణమైనా జీవో ఇచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రభుత్వం చేపట్టే తదుపరి చర్యలపై..

Kaleshwaram Case: కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ..

నేటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోండి

  • హైకోర్టుకు కేసీఆర్‌, హరీశ్‌రావు విజ్ఞప్తి

  • మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వని కోర్టు

  • నేడు వివరణ ఇవ్వాలని సర్కార్‌కుఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణమైనా జీవో ఇచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రభుత్వం చేపట్టే తదుపరి చర్యలపై స్టే విధించాలని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తదుపరి చర్యలను అడ్డుకోకపోతే కాళేశ్వరం కమిషన్‌ నివేదికకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్లు, తమ శ్రమ వృధా అవుతాయని పేర్కొన్నారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ సెక్షన్‌ 8-బీ, 8-సీ కింద నోటీసులు ఇవ్వకుండా జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక చెల్లదని, దానిని కొట్టేయాలని కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కేసీఆర్‌, హరీశ్‌రావుకు అనుకూలంగా హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. తమ పిటిషన్లపై తుది తీర్పు వెలువడే వరకు అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటూ శనివారం కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో మళ్లీ మధ్యంతర దరఖాస్తులు (ఐఏ) దాఖలు చేశారు. తాజాగా వాటిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ సోమవారం ఉదయం 10.30 గంటలకు చీఫ్‌జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు ప్రస్తావించారు.


పోలీస్‌ యాక్ట్‌ 6(2) ప్రకారం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారమే జీవో ఇచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే తమ శ్రమంతా వృధా అవుతుందన్నారు. ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ‘‘ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మీరు సూచనలు ఇస్తే ఇవ్వండి.. లేకపోతే పొండి’ అంటూ అర్ధరాత్రి 2 గంటలకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని ప్రకటించార’ని పేర్కొన్నారు. ఇది హైకోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించడం కిందకే వస్తుందన్నారు. వాదనలువిన్న ధర్మాసనం.. ‘చర్యలు తీసుకున్నారా? తీసుకుంటారా?’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి అందుబాటులో లేరని, వచ్చే వారం ఏదో ఒకరోజు విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. మంగళవారం ప్రభుత్వ వివరణతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 03:18 AM