Share News

Kavitha Kalvakuntla: నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:17 AM

తెలంగాణ సాహిత్యం ప్రపంచస్థాయి కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. యువ కవులు తమ రచనలు ప్రదర్శించి, తెలంగాణ సంస్కృతిని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

 Kavitha Kalvakuntla: నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే

రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయి సాహిత్యం రావాలి

పాలకులు ఎవరున్నా ప్రశ్నించాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకవుల సమ్మేళనం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయి సాహిత్యం రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి వర్థిల్లడం ద్వారానే ఈ నేల సమృద్ధిగా ఉంటుందన్నది తెలంగాణ జాగృతి విశ్వాసమని పేర్కొన్నారు. చిన్నారులు బతుకమ్మ పాటలు నేర్చుకోవడం ద్వారా, యువత సాహిత్య రంగంలోకి ప్రవేశించడం ద్వారా కనీసం మరో వందేళ్ల వరకైనా మన సంస్కృతి, సాహిత్యాలు విరాజిల్లుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ ధిక్కార స్వభావం తెలంగాణ కవుల సొంతమని గుర్తు చేశారు. యువ వికాసం పథకానికి శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్నందుకు.. సీఎం రేవంత్‌ ఆ కార్యక్రమాన్నే రద్దు చేసుకొన్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా కవులు, రచయితలు, కళాకారులు గళమెత్తాలని కోరారు. ఇది ఒక రకంగా తెలంగాణ జాగృతి విజయమని వ్యాఖ్యానించారు. ‘‘ఇవాళ మా నాన్న అధికారంలో లేనందున ప్రశ్నించమంటున్నానని అనుకుంటున్నారేమో.! కవులు ఎప్పుడూ ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిందే.. అప్పుడే అభివృద్ధి దిశగా సమాజం ముందుకు సాగుతుంది. నా పేరే కవిత. నేనెప్పుడూ ప్రజల పక్షమే ఉంటాను’’ అని వ్యాఖ్యానించారు. కవి సమ్మేళనంలో వివిధ జిల్లాలకు చెందిన 55మంది యువతీ, యువకులు తాము రాసిన కవిత్వాన్ని సభలో చదివి వినిపించారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 06:17 AM