Kavitha: నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: కవిత
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:27 PM
ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను మంగళవారం ఆమె సందర్శించారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని చెప్పారు.
జడ్చర్ల, ఆక్టోబర్ 28: ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఉదండాపూర్ నిర్వాసిత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని చెప్పారు. 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని.. పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందేనని అన్నారు.
తప్పు బీఆర్ఎస్ చేసిందా? కాంగ్రెస్ చేసిందా? అని కాదని.. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగతా పనులు ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు. జనంబాటలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసని చెప్పారు. వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారని ఆనాటి రోజులను గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారానీటి సమస్యలను అధిగమించామని చెప్పారు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేసీఆర్ చేపట్టారని తెలిపారు. ఉదండాపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు అప్పుడే పూర్తయ్యాయని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. రేవంత్ రెడ్డి గెలిచి కూడా రెండేళ్లు అయ్యిందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కోసం భూములు ఇవ్వటానికి ఇక్కడి ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Operation Kagar: మరో అగ్రనేత నేత లొంగుబాటు.. మావోయిస్టులకు మళ్లీ దెబ్బ
KCR Pays Homage: తన బావ సత్యనారాయణ పార్థీవదేహానికి నివాళులర్పించిన కేసీఆర్