Kavitha: ప్రతి మహిళకు రేవంత్ బాకీ రూ.35 వేలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:32 AM
మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇప్పటివరకు రూ.35,000 రేవంత్ సర్కార్ బాకీ పడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తులం బంగారం, స్కూటీ హామీలు ఏమయ్యాయి?
మహిళా దినోత్సవం లోపు కార్యాచరణ ప్రకటించాలి
లేకుంటే ప్రజా ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇప్పటివరకు రూ.35,000 రేవంత్ సర్కార్ బాకీ పడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కూడా ఆ హామీని అమలు చేయకపోవడం దారుణం. 14 నెలల డబ్బు రూ.35,000 చొప్పున రాష్ట్రంలోని ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది.
మహిళా దినోత్సవం లోపు (మార్చి 8) హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.