Share News

‘గ్యారెంటీలు’ భారమని రేవంత్‌ చెప్పారు!

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:22 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అంశంపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. గ్యారెంటీల అమలు భారంగా మారిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ ప్రతిపక్ష (బీజేపీ) నేత అశోక్‌ సభలో ప్రస్తావించారు.

‘గ్యారెంటీలు’ భారమని రేవంత్‌ చెప్పారు!

  • ముఖ్యమంత్రి అయ్యాకే భారం విలువ తెలిసిందన్నారు

  • జాతీయ స్థాయిలో చర్చ కూడా జరగాలన్నారు

  • తెలంగాణ గ్యారెంటీల అంశాన్ని కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేత అశోక్‌

బెంగళూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అంశంపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. గ్యారెంటీల అమలు భారంగా మారిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ ప్రతిపక్ష (బీజేపీ) నేత అశోక్‌ సభలో ప్రస్తావించారు. ‘ఆరు గ్యారెంటీల అమలు భారంగా మారుతోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ చర్చాగోష్ఠిలో చెప్పారు. సీఎం అయిన తర్వాతే భారం విలువ తెలిసొచ్చిందనీ వ్యాఖ్యానించారు. ఏడాదికి రూ.18 వేల కోట్ల పింఛన్లు, వేతనాలను చెల్లిస్తున్నామని, గ్యారెంటీలు భారం అవుతున్నాయని చెప్పారు. వీటిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని కూడా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన పొరుగు రాష్ట్ర సీఎం గ్యారెంటీలు భారం అంటుంటే కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్‌ కార్యకర్తలకు రాజకీయ ఉద్యోగాలు కల్పించేలా, అమలుకు కమిటీ వేసి, క్యాబినెట్‌ ర్యాంకులు కట్టబెట్టారు’ అని సిద్దరామయ్య సర్కారుపై అశోక్‌ ధ్వజమెత్తారు.


కర్ణాటకలో అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై మంగళవారం సభ అట్టుడికింది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభ్యుల అధికారాలను లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని అశోక్‌ ఆరోపించారు. శాసనసభ నియోజకవర్గంలో కమిటీ ఏదైనా ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉండాలని, ఈ నిబంధనను దేశంలోని అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయని చెప్పారు. కానీ, రాష్ట్రంలో గ్యారెంటీ పథకాల అమలుకు కమిటీ వేసి, కాంగ్రెస్‌ కార్యకర్తలకు క్యాబినెట్‌ హోదాలు కల్పించి, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే జోక్యం చేసుకొని.. మహారాష్ట్రలో మంత్రుల పీఏలుగా ఆరెస్సెస్‌ కార్యకర్తలను నియమించుకుని వేతనాలివ్వడం లేదా? అని నిలదీశారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.

Updated Date - Mar 12 , 2025 | 04:22 AM