అసాంఘిక శక్తులపై కఠినచర్యలు
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:34 AM
రామగుండం కమిషరేట్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు వెంటనే వెళ్లిపోవాలని, లేకపోతే తానే వెళ్లగొడతానని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు.

కోల్‌సిటీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రామగుండం కమిషరేట్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు వెంటనే వెళ్లిపోవాలని, లేకపోతే తానే వెళ్లగొడతానని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. రామగుండం కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. పోలీస్ అంటేనే ప్రజల్లో భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తమ పని తీరు ఉంటుం దన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధి పారిశ్రామిక జిల్లాలతో కూడు కున్నదని, ఇక్కడ యువత ఎక్కువగా ఉందని, యువత సంపద అని, దానిని సన్మార్గంలో పయనించేలా శిక్షణ ఇస్తామన్నారు.
ఆంధ్రజ్యోతి: మీ స్వస్థలం?
కమిషనర్: బీహార్‌లోని మధుబని స్వస్థలం.
ఆంధ్రజ్యోతి: మీ విద్యాభ్యాసం?
కమిషనర్: 12వ తరగతి వరకు మధుబనిలో చదివాను. ట్రిచీ ఎన్‌ఐటీలో ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. హిందుస్థాన్ పెట్రోలి యం కంపెనీలో వైజాగ్, గుజరాత్‌ల్లో ఏడాది పాటు పని చేశాను. 2009లో సివిల్స్‌కు ఎంపికయ్యాను.
ఆంధ్రజ్యోతి: మీ కుటుంబ నేపథ్యం?
కమిషనర్: నా భార్య త్రిప్తి మిశ్రా ఎండీ(పాథాలజీ) ఢిల్లీలోని అంబాలలో పని చేస్తుంది. ఇద్దరు పిల్లలు. ఒకరు 4వ తరగతి, మరొకరు 6వ తరగతి.
ఆంధ్రజ్యోతి: కమిషనరేట్‌లో నేరాల నియంత్రణకు తీసుకునే చర్యలు?
కమిషనర్: రామగుండం కమిషనరేట్ పారిశ్రామిక జిల్లాలతో కూడుకున్నది. ఊట్నూరు ఏఎస్‌పీగా ఉన్నప్పుడు మంచిర్యాల ఇన్‌చార్జి ఏఎస్‌పీగా పని చేశాను. ఈ ప్రాంత ప్రజలు మంచివారు. పోలీసులంటే భరోసా కల్పించేలా చర్యలు చేపడుతాను.
ఆంధ్రజ్యోతి: కమిషనరేట్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కు వగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి.?
కమిషనర్: అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల విషయంలో రాజీ పడేది లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు వెంటనే కమిషనరేట్ వదిలి వెళ్లిపోవాలి. లేకపోతే నేనే పంపించేస్తా. మంచిగా ఉండే వారికి గౌరవమిస్తా.
ఆంధ్రజ్యోతి: కమిషనరేట్ పరిధిలో యువతలో మార్పునకు ఏమైనా చర్యలు చేపట్టారా...?
కమిషనర్: కమిషనరేట్ ఎదుట యువత ఖాళీగా ఉండడాన్ని గుర్తించాను. రామగుండంలో యువత ఒక సంపద. వారికి శిక్షణనిచ్చి ఉపాధి వైపు తీసు కెళ్లాలి. తద్వారా సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి. ఇందుకు సింగరేణి, ఎన్‌టీపీసీ వంటి పరిశ్రమలతోపాటు ప్రభుత్వశాఖలతో కూడా సంప్రదిస్తాను. త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతాం.
ఆంధ్రజ్యోతి: గంజాయి సామాజిక మహమ్మారిగా మారింది. దీని నియంత్రణకు చర్యలేమిటి?
కమిషనర్: గంజాయి నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నా. డ్రగ్ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేశాం. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఎస్‌ఐ, ఇతర సిబ్బంది ఈ టీములో ఉంటారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక నంబర్ కూడా ఏర్పాటు చేస్తా. గంజాయి రవాణా, విక్రయాలను ఉపేక్షించేది లేదు. గంజాయి సమాచారం చెప్పే వారి విషయంలో గోప్యత పాటిస్తాం.
ఆంధ్రజ్యోతి: రౌడీషీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై మీ స్పందన?
కమిషనర్: ప్రజల రక్షణ మాకు ముఖ్యం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదు. అందరిని పిలిచి కౌన్సెలింగ్ చేస్తా. పీడీ యాక్టులు తప్పవు.
ఆంధ్రజ్యోతి: టాస్క్‌ఫోర్స్ నామమాత్రమైందంటున్నారు..?
కమిషనర్: రామగుండం టాస్క్‌ఫోర్స్‌లో సిబ్బంది సంఖ్యను పెంచి పటిష్ట పరుస్తాం. ఇప్పటికే వారితో సమావేశం నిర్వహించాను. వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నాం. వారు సమాచారం సేకరించేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, శారీర దారుఢ్యత కూడా ముఖ్యమే. తాను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పని చేసినప్పుడు పటిష్టమైన టాస్క్‌ఫోర్స్ టీమును పెట్టాను. ఇక్కడ కూడా అలాంటి టీమ్ పని చేయబోతుంది.
ఆంధ్రజ్యోతి: భూ కబ్జాల విషయంలో మీ వైఖరి ఏమిటి?
కమిషనర్: నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం. బాధితులకు న్యాయం చేసేలా మా పని తీరు ఉంటుంది. ఫిర్యాదులపై సీనియర్ అధికారులతో విచారణ జరిపిస్తాం.
ఆంధ్రజ్యోతి: పోలీస్‌స్టేషన్‌లలో మధ్యవర్తుల ప్రమేయం పెరిగిందనే ఆరోపణలున్నాయి?
కమిషనర్: ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఎవరి సిఫార్సు ఉన్నా లేకున్నా బాధితుల గోడు వింటాం. వారికి న్యాయం జరిపించేందుకు పని చేస్తాం.