తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:51 PM
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటు న్నామని మిషన్ భగీరథ (ఇంట్రా) ఈఈ గంగాధర శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని 1,23,144 ఇళ్లకు రోజు నీటి సరఫరా చేస్తున్నామని, మరికొన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చేందుకు పనులు చేపట్టామన్నారు.

పెద్దపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటు న్నామని మిషన్ భగీరథ (ఇంట్రా) ఈఈ గంగాధర శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని 1,23,144 ఇళ్లకు రోజు నీటి సరఫరా చేస్తున్నామని, మరికొన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చేందుకు పనులు చేపట్టామన్నారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, వాటర్ ప్లాంట్ల నీళ్ల కంటే మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీళ్లలోనే అధిక లవణాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి సురక్షమని స్పష్టం చేశారు. ఆయనతో ఆంధ్రజ్యోతి నిర్వహించిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎన్ని నివాసాలకు నీళ్లు ఇస్తున్నారు?
ఈఈ: జిల్లాలో 266 గ్రామ పంచాయతీల్లోని 425 ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా 1,23,144 ఇళ్లకు నల్లాల ద్వారా రోజూ నీరంది స్తున్నాం. ఒక్కో ఇంటికి 400 లీటర్ల చొప్పున 55 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. 637 ఓవర్ హెడ్ ట్యాంకులకు మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి నీళ్లు సరఫరా అవుతున్నాయి. 3,907 బోర్లు, 604 సింగిల్ ఫేజ్ మోటా ర్లు గల బోర్లు, 513 త్రీఫేజ్ మోటారు బోర్లు, 306 బావులు కూడా ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి: జిల్లాలో అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయా?
ఈఈ: మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినప్పుడు 1,24,086 గృహాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆవాసాలు దూరం ఉండడం వల్ల 942 ఇళ్లకు నల్లాలు ఇవ్వలేక పోయాం. ప్రస్తుతం ఆ నివాసాల వద్దకు పైపులైన్లు వేసి కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం.
ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి ఎద్దడి నెలకొన్నదా?
ఈఈ: ఎక్కడా కూడా తాగునీటి ఎద్దడి లేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు, ధర్మారం మండ లాలకు మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా ఫిల్టర్ వాటర్ సరఫరా అవుతున్నాయి. ఎక్కడైనా పైపులైన్లు డ్యామేజీ, లీకేజీలు అయినప్పుడు మరమ్మతు పనులు చేపట్టే వరకు తాగునీటి సరఫరా నిలిచి పోతున్నది. దానికి ప్రత్యామ్నా యంగా గ్రామాల్లో గల బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో 10 ఇళ్లకు నీటిని సరఫరా లేకపోవడంతో పైపులైన్ వేసి నీటిని సరఫరా చేస్తున్నాం.
ఆంధ్రజ్యోతి: బుధవారంపేట పరిధిలోని తెనుగుపల్లికి నీళ్లు ఎందుకు రావడం లేదు?
ఈఈ: మిషన్ భగీరథ రికార్డుల ప్రకారం తెనుగుపల్లిలో 130 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వాటి సంఖ్య 200 ఇళ్లకు పెరిగింది. 14 లక్షల రూపాయలతో పైపులైన్లు వేసి వంద ఇళ్ల వరకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం. మిగతా ఇళ్లకు కూడా నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తాం.
ఆంధ్రజ్యోతి: మంథని ప్రాంతంలో పనులు పెండింగులో ఉన్నాయి?
ఈఈ: మంథని, ముత్తారం, కమాన్‌పూర్, రామగిరి, పాలకుర్తి మండ లాల్లో పలు గ్రామాల్లో 26 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాం. పైపులైన్లు లేక అక్కడ నీటి సరఫరా చేయలేక పోతున్నాం. ఈ విషయమై కలెక్టర్ ప్రత్యే క చొరవ తీసుకుని రూ.4.80 కోట్లు మంజూరు చేశారు. ఏప్రిల్ నెలాఖరు వరకు పనులు పూర్తి చేసి ఆ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తాం.
ఫ ఆంధ్రజ్యోతి: ఎస్‌డీఎఫ్ కింద ఎన్ని పనులు చేపట్టారు? గత ఏడాది పనులకు బిల్లులు ఎందుకు రావడం లేదు?
ఈఈ: గత ఏడాది ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎస్‌డీఎఫ్ కింద ఇచ్చిన నిధుల్లో రూ.2.88 కోట్లు తాగునీటి పనులకు కేటాయించారు. 61 పనులు చేప ట్టాం. వాటిలో 42 పనులు పూర్తి కాగా, మిగతా పనులు ప్రగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద గతేడాది 185 క్రిటికల్ గ్యాప్స్ పనులకు రూ.1.83 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 175 పనులు పూర్తయ్యాయి. బిల్లులు ఆన్‌లైన్ చేశాం. తమ వద్ద పెండింగులో లేవు.
ఆంధ్రజ్యోతి: తాగు నీటి సమస్య తలెత్తినప్పుడు ఎవరిని సంప్రదించాలి?
ఈఈ: టోల్ ఫ్రీ నంబర్ 18005994007 హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇస్తారు. తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటి వరకు సబితం, పొట్యాల, ధర్మారం చెందిన పలువురు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్లు చేస్తే సమస్య పరిష్కరించాం.
ఆంధ్రజ్యోతి: మిషన్ భగీరథ వాటర్‌ను అందరూ వినియోగిస్తున్నారా?
ఈఈ: మొదట్లో మిషన్ భగీరథ వాటర్‌ను వినియోగించేందుకు చాలా మంది ఇబ్బందిపడ్డారు. గ్రామాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వ హించాం. ఆర్‌వో వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, వాటర్ ప్లాంట్ల వాటర్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. శరీరానికి సరిపడా లవణాలు అందులో ఉండవు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 100 నుంచి 500 శాతం టీడీఎస్ ఉండాలి. మిషన్ భగీరథ నీటిలో 250 నుంచి 300 శాతం వరకు లవణాలు ఉండగా, వాటర్ ప్లాంట్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్, ఆర్‌వో ప్లాంట్ల వాటర్‌లో 25 నుంచి 40 శాతం వరకే లవణాలు ఉన్నాయి. ఆ నీటిని మా ల్యాబ్‌ల్లో పరీక్షిం చాం. డబ్బులు పెట్టి ఆ వాటర్‌ను కొని అనారోగ్యం పాలవుతున్నారు. ఆ వాటర్ తాగడం వల్ల ఎముకల పటుత్వాన్ని కోల్పోతున్నాయి. ప్రతీ ఒక్కరికి మిషన్ భగీరథ నీరే సురక్షితం అని గ్రహించాలి. ఆ దిశగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.