Share News

బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:36 AM

ప్రభుత్వ గురుకులాలో చదివే బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రంగంపల్లి కాలనీలో ఉన్న మహాత్మాజ్యోతిభాపూలే బీసీ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు.

బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలి

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గురుకులాలో చదివే బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రంగంపల్లి కాలనీలో ఉన్న మహాత్మాజ్యోతిభాపూలే బీసీ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. డార్మెంటరీ, క్లాస్‌ రూం, పారిశుధ్య నిర్వహణ, భోజన హాల్‌, వంటగది పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం నాణ్యత, విద్యాబోధన వివరాలను ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ గురుకులంలో విదార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. హాస్టల్‌కు వచ్చే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలన్నారు. బాలికలకు ప్రభుత్వం నిర్ధేశించిన కామన్‌ మెనూను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 10వ తరగతి పరీక్షల దృష్ట్యా స్టడీ అవర్స్‌ నిర్వహించాలన్నారు. గురుకులంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా ప్రతిపాదనలు తయారుచేసి పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆమె పిల్లలతో కలిసి భోజనం చేశారు. బీసీ బాలికల గురుకులం ప్రిన్సిపాల్‌ మణీదీప్తి, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:36 AM