రేపు సీఎం రేవంత్‌రెడ్డి రాక
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:04 AM
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఈనెల 25న ప్రచారం ముగియనుండగా 24న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఈనెల 25న ప్రచారం ముగియనుండగా 24న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, చేకూర్చిన లబ్ధి, భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలు వివరించి పట్టభద్రుల్లో పార్టీపై మరింత సానుకూలత సాధించే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటనను రూపొందించుకున్నారని చెబుతున్నారు. సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.
ఎస్సారార్ కళాశాల మైదానంలో..
కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరించి, పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కోరాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిచేలా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని రాబోయే మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు కృషిచేసేలా వ్యూహం రూపొందించి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సమన్వయ బాధ్యతలు సంతోష్‌కుమార్ రుద్రకు..
ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాటజీ అమలు, సమన్వయ బాధ్యతలను సంతోష్‌కుమార్ రుద్రకు అప్పగిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ రూపొందించిన వ్యూహాన్ని మండల, గ్రామ, బూత్ స్థాయిల్లోకి తీసుకువెళ్లి ఆయన అమలు చేస్తారు. ఓటరును కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చేలా చూడడం, క్షేత్రస్థాయి శ్రేణులు, మండల, జిల్లా స్థాయి నాయకుల సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతో అభ్యర్థి గెలుపునకు కృషిచేసి ఎప్పటికప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రిపోర్టు చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే జీవన్‌రెడ్డిని గెలిపించుకున్న మాదిరిగా ఈసారి కూడా నరేందర్‌రెడ్డిని గెలిపించుకొని తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.