Share News

Kavitha Press Meet: పార్టీ నుంచి సస్పెన్షన్.. కవిత సంచలన కామెంట్స్..

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:08 PM

భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయటంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

Kavitha Press Meet: పార్టీ నుంచి సస్పెన్షన్.. కవిత సంచలన కామెంట్స్..
Kavitha Press Meet

హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయటంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జై తెలంగాణ నినాదంతో ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సస్పెన్షన్ లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు.


కవిత మాట్లాడుతూ.. ‘ నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారు. బయటకు రాగానే.. 2024, నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రజా క్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నేను చేసిన పనుల్లో మొట్టమొదటిది.. ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పెద్ద ఎత్తున పని చేశా. మహిళలకు 2500 ఇవ్వాలని పోస్టుకార్డు ఉద్యమం చేశాను’ అని అన్నారు.


పార్టీలోని కొందరు నాపై కక్షగట్టారు.

‘10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాల్లో పర్యటించా. రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా స్పందించా. పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా.. అది తప్పా?. నేను ఏం తప్పుగా మాట్లాడాను.. సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ వ్యతిరేకం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.


కేటీఆర్‌కు కవిత సూటి ప్రశ్నలు

‘కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?. నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు కూర్చోని నాపై ప్రెస్‌మీట్ పెట్టారు. అది మంచిదే.. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు. పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


హరీష్‌రావు టార్గెట్‌గా  విమర్శలు

‘సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే. కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా?’ అంటూ కంటతడి పెట్టుకున్నారు.


పుణ్యం వల్లే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా

‘ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా?. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది. వీళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు.. కుట్రలు చేస్తారు. వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల సహా ఎంతోమంది పార్టీని వీడారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్‌రావే దగ్గరుండి గెలిపించారు. ఈ విషయాలను కేటీఆర్ గుర్తించాలి. నాకు పదవులపై ఆశ లేదు.. బయటకు వచ్చేశా. ఇప్పటికైనా అన్ని విషయాలను కేటీఆర్ గమనించాలి. హరీష్‌రావు చెవిలో జోరీగ లాంటివారు. పార్టీలో జరిగే తప్పులన్నీ రామన్నపై మోపుతున్నారు. దళితులు మరణించిన అంశంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు’ అని అన్నారు.


నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

‘నా 20 ఏళ్ల జీవితాన్ని బీఆర్ఎస్, తెలంగాణ కోసం పనిచేయడానికి వెచ్చించా. సస్పెన్షన్‌పై మరోసారి ఆలోచించాలి. అయినా నాకు ప్రజలున్నారు. వాళ్ల దగ్గరికే వెళ్తా. బీఆర్ఎస్ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని నేను అనలేదు. కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అన్నాను. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్‌రావు డబ్బు పంపారు. పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. హరీష్‌రావు ,సంతోష్ బీఆర్‌ఎస్‌ను జలగల్లాగా పట్టిపీడిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరూ అంటకాగుతున్నారు. సంతోష్‌రావు బాధితులు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు’ అని అన్నారు.


ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. కవిత వేరే పార్టీలో చేరుతుందంటూ జరుగుతుందన్న ప్రచారంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరనని, తనకు ఏ పార్టీతో పనిలేదని స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. గొడవల నేపథ్యంలో అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

దేశాధినేతల భేటీ.. ఆసక్తికర సంఘటన

సినిమాను మించిన ట్విస్ట్.. మిస్సింగ్ మిస్టరీ సాల్వ్..

Updated Date - Sep 03 , 2025 | 01:16 PM