Share News

Instagram Reel Reveals: సినిమాను మించిన ట్విస్ట్.. మిస్సింగ్ మిస్టరీ సాల్వ్..

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:27 AM

కొద్దిరోజుల క్రితం షీలూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉంది. అప్పుడు ఆమె దృష్టి ఓ వ్యక్తిపై పడింది. లుథియానాకు చెందిన ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు.

Instagram Reel Reveals: సినిమాను మించిన ట్విస్ట్.. మిస్సింగ్ మిస్టరీ సాల్వ్..
Instagram Reel Reveals

అచ్చం సినిమాను తలపించే ట్విస్ట్ ఇది. ఓ వ్యక్తి తన భార్య గర్భంతో ఉన్నపుడు సడెన్‌గా కనిపించుకుండా పోయాడు. భార్యే అతడ్ని చంపి మాయం చేసిందని అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా రీల్‌తో అతడి ఆచూకీ దొరికింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సందీలాలోని మురార్ నగర్‌‌‌కు చెందిన జితేంద్ర కుమార్‌కు 2017లో షీలూతో పెళ్లయింది.


జితేంద్రను ఆ ఊర్లో వారు బబ్లూ అని పిలిచేవారు. పెళ్లయిన సంవత్సరానికి షీలూ గర్భం దాల్చింది. 2018 చివర్లో బిడ్డ పుట్టడానికి కొన్ని నెలల ముందు జితేంద్ర కనిపించకుండా పోయాడు. జితేంద్ర కుటుంబసభ్యులు కనిపించకుండా పోయిన జితేంద్రను వెతకటం మానేసి షీలూపై ఆరోపణలు చేయటం మొదలెట్టారు. ‘నువ్వే మా జితేంద్రను చంపేసి ఉంటావు. శవం ఎవరికీ దొరకకుండా దాచేసి ఉంటావు’ అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఇక, అప్పటినుంచి భర్త మర్డర్ కేసులో షీలూ నిందితురాలిగా ఉంది. ఒంటరిగా కొడుకు పెంచుతూ ఉంది. ఊరిలో వాళ్లు ఆమెను ‘భర్తను చంపిన స్త్రీ’ అంటూ వేధించసాగారు. అన్నిటినీ భరిస్తూ బిడ్డకోసం ఒంటరి పోరాటం చేయసాగింది. నెలలు, సంవత్సరాలు భారంగా గడిచిపోయాయి. 2025 వచ్చింది. కొద్దిరోజుల క్రితం షీలూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉంది. అప్పుడు ఆమె దృష్టి ఓ వ్యక్తిపై పడింది. లుథియానాకు చెందిన ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని నిశితంగా పరిశీలించిన ఆమెకు షాక్ తగిలింది.


ఆ వ్యక్తి ఎవరో కాదు.. 2018లో కనిపించకుండా పోయిన ఆమె భర్త బబ్లూ. అతడితో పాటు ఓ మహిళ కూడా ఉంది. ఆ వీడియోలో అతడు ఆమెతో ఎంతో చనువుగా ఉన్నాడు. షీలూ వెంటనే పోలీసులకు ఈ విషయం చెప్పింది. వారు విచారణ చేయగా అతడు బబ్లూనే అని ధ్రువీకరణ అయ్యింది. బబ్లూతో ఉన్న ఆమె అతడి రెండో భార్య అని తేలింది. షీలూ నుంచి పారిపోయిన తర్వాత బబ్లూ పంజాబ్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పెళ్లి చేసుకుని లుథియానాలో సెటిల్ అయ్యాడు. పోలీసులు లుథియానా వెళ్లి బబ్లూను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఇళ్లపై విరిగిపడ్డ కొండ చరియలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య..

బతుకుదెరువు కోసం వచ్చి.. బెట్టింగ్‌ దందా

Updated Date - Sep 03 , 2025 | 11:30 AM