Mandi Landslide Buries Homes: ఇళ్లపై విరిగిపడ్డ కొండ చరియలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య..
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:42 AM
కొండచరియలు స్కూటర్‌తో సహా అతడ్ని కప్పెట్టేశాయి. సెర్చ్ ఆపరేషన్‌లో అతడి శవాన్ని వెలికితీశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ప్రకృతి విలయానికి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మంగళవారం సాయంత్రం మండి జిల్లాలోని సుందర్‌నగర్‌లో ఓ రెండు ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. నిన్న సెర్చ్ ఆపరేషన్‌లో శిథిలాల కిందనుంచి నాలుగు శవాలను బయటకు తీశారు. ఈ రోజు మరో రెండు శవాలు బయటకు తీశారు. పొక్‌లైన్‌తో మట్టి తవ్వి తల్లీ,కొడుకుల మృతదేహాలను వెలికితీశారు. వారిని సురిందర్ కౌర్, గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు.
ఇంటి పైకప్పును కట్ చేసి రెండు శవాలను బయటకు తీశారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో దడ్యాల్ ఏరియాకు చెందిన ప్రకాష్ వర్మ స్కూటర్‌పై వెళుతూ ఉన్నాడు. కొండచరియలు స్కూటర్‌తో సహా అతడ్ని కప్పెట్టేశాయి. సెర్చ్ ఆపరేషన్‌లో అతడి శవాన్ని వెలికితీశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ప్రకాష్ వర్మతో పాటు మరో వ్యక్తి కూడా స్కూటర్‌పై ఉండి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతడి శవం కోసం గాలిస్తున్నారు. ఓ టాటా సుమో కూడా శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం.
ఈ రాష్ట్రాలకు ఐఎమ్‌డీ రెండ్ అలర్ట్
హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, ఉన్నా, బిలాస్‌పూర్, శిర్మౌర్, సోలాన్ జిల్లాలో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, ప్రభుత్వం సైతం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!