Kaleshwaram project: కాళేశ్వరం బ్యారేజీలపై దిద్దుబాట!
ABN , Publish Date - May 03 , 2025 | 03:51 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ఎన్‌డీఎస్ఏ నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఎన్‌డీఎస్ఏ నివేదిక అధ్యయనానికి కమిటీ
సత్వర సిఫారసులకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్ఏ ) నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నివేదికపై అధ్యయనం చేసి.. తదుపరి చర్యలు చేపట్టేందుకు ఈఎన్‌సీ(జనరల్), ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం), రామగుండం చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ఎన్‌డీఎ్‌సఏ నివేదికను అధ్యయనం చేయడంతోపాటు బ్యారేజీల రక్షణకు, వాటిపై ఆధారపడిన వారి కోసం తీసుకునే చర్యలకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు పూర్తిగా నిరుపయోగంగా మారిందని ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో పేర్కొంది.
దీంతోపాటు మిగిలిన బ్లాకుల్లోనూ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ అవే రకమైన సమస్యలు ఉన్నాయని, తద్వారా మూడు బ్యారేజీలు ఇప్పటికిప్పుడు నిరుపయోగమేనని నివేదిక వివరించింది. అన్ని రకాల పరీక్షలు/అధ్యయనాలు చేశాక.. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఈ బ్యారేజీల పునరుద్ధరణ చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు తీసుకొని అమలు చేయాలని సూచించింది. ఈ పరిశోధనలు/అధ్యయనాల కోసం దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల సేవలను వినియోగించుకోవాలని సిఫారసు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే కారణమని స్పష్టం చేసింది. ఈ బ్యారేజీలోని కుంగిన బ్లాకు-7 మొత్తాన్ని తొలగించాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News