KCR Legal Strategy: కిం కర్తవ్యం
ABN , Publish Date - May 21 , 2025 | 03:52 AM
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. విచారణకు హాజరవుదామా లేక లిఖితపూర్వక వివరణ ఇవ్వాలా అన్న దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.
కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఏం చేద్దాం?
విచారణకు హాజరు కావాలా.. వద్దా?.. కేసీఆర్ సమాలోచనలు
ఎర్రవెల్లిలో ఆయనతో హరీశ్ భేటీ
న్యాయనిపుణుల సలహాతో 2-3 రోజుల్లో నిర్ణయం!
హైదరాబాద్, గజ్వేల్, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులకు ఎలా స్పందిద్దాం? విచారణకు వెళ్లాలా.. వద్దా? లిఖితపూర్వకంగా వివరణ ఇద్దామా? న్యాయనిపుణుల సలహాతో ముందుకు వెళ్దామా? కిం కర్తవ్యం?’’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీఘోష్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. ఆయనతోపాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌కు సైతం కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో.. హరీశ్ రావు మంగళవారంరాత్రి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. 9వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ తనకు వచ్చిన నోటీసు ప్రతిని కేసీఆర్ వద్దకు హరీశ్ తీసుకువెళ్లినట్లు సమాచారం. నోటీసుల్లో ఏం ఉంది? విచారణకు వెళ్తే ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? వాటికి ఏం సమాధానం చెప్పాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అసలు విచారణకు వెళ్లాలా.. వద్దా? అనే అంశంపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అంతర్గత సమాలోచనలు జరిపి.. న్యాయనిపుణులు ఇచ్చే సూచనల ఆధారంగా.. ఒకటి, రెండు రోజుల్లో ఆయన కీలకనిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక.. కమిషన్ సూచించిన తేదీన విచారణకు హాజరు కావాలని అప్పటి ఆర్థికశాఖ మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాను ఆర్థికమంత్రిగా కొనసాగినప్పటికీ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలలో తన శాఖ ప్రమేయం లేదని, దీని కోసం ప్రత్యేకంగా కెటాయించిన బడ్జెట్ ద్వారానే నిధుల వినియోగం జరిగిందని ఆయన తన ఆత్మీయులతో పేర్కొన్నట్లు సమాచారం.