Kaleshwaram Commission: అందరూ మాట్లాడుకొని అఫిడవిట్లు ఇచ్చారా?
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:06 AM
‘‘కట్ అండ్ పేస్ట్ చేసినట్లు అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయి. అందరూ మాట్లాడుకొని ఒకేలా అఫిడవిట్లు ఇచ్చారా?’’ అని సుందిళ్ల బ్యారేజీను నిర్మించిన నవయుగ సంస్థ ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది.
కట్ అండ్ పేస్ట్ చేసినట్టు ఒకేలా ఉన్నాయేంటి?
‘నవయుగ’ ప్రతినిధులకు కాళేశ్వరం కమిషన్ ప్రశ్న
సుందిళ్ల వద్ద ప్రవాహ వేగం అంచనాలో వైఫల్యం
2022 నుంచి సీసీ బ్లాకుల రిపేర్.. బుంగలకు గ్రౌటింగ్
బ్యారేజీ దెబ్బతినడంతో బిల్లులు ఆపేశారని సంస్థ వెల్లడి
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘‘కట్ అండ్ పేస్ట్ చేసినట్లు అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయి. అందరూ మాట్లాడుకొని ఒకేలా అఫిడవిట్లు ఇచ్చారా?’’ అని సుందిళ్ల బ్యారేజీను నిర్మించిన నవయుగ సంస్థ ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. నవయుగ సంస్థ ప్రతినిధులను కమిషన్ గురువారం క్రాస్ ఎగ్జామిన్ చేసింది. సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధుల అఫిడవిట్లను పరిశీలించిన కమిషన్.. ఈ విధంగా వ్యాఖ్యానించింది. ప్రవాహ వేగాన్ని అంచనా వేయడంలో వైఫల్యం వల్లే బ్యారేజీ దెబ్బతిందని, డిజైన్‌కు తగ్గట్లుగానే తాము నిర్మాణం చేశామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. సీసీ బ్లాకులు ఎన్ని సార్లు కొట్టుకుపోయాయని కమిషన్ ప్రశ్నించగా... 2022 వరదలకు బ్లాకులు చెల్లాచెదురయ్యాయని, ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలాగే జరిగిందని బదులిచ్చారు.
బ్యారేజీలో బుంగలు ఏర్పడగా.. గ్రౌటింగ్ చేశామని తెలిపారు. బ్యారేజీ నిర్మాణం 2021 డిసెంబరులోరు పూర్తయిందని, ఆ తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఒప్పందమేమీ జరగలేదని తెలిపారు. నిర్మాణం తర్వాత ఫైనల్ పేమెంట్ కోసం బిల్లులు సమర్పించగా.. బ్యారేజీ దెబ్బతినడంతో చెల్లింపులు ఆపేశారని పేర్కొన్నారు. ఇంకా రూ.220 కోట్ల మేర సంస్థకు రావాల్సి ఉందని వివరించారు. బ్యారేజీలో బుంగలు పడ్డ తర్వాత జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌స) సిఫారసులతో అన్ని రకాల పరీక్షలు చేసి ఎన్‌డీఎ్‌సఏకు నివేదికలు అందించామన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీని కట్టిన ఎల్‌అండ్‌టీ ప్రతినిధులను శుక్రవారం, అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులను శనివారం కమిషన్ విచారించే అవకాశం ఉంది. ఇదే సంస్థకు చెందిన ఓ ప్రతినిధిని విచారించే క్రమంలో తుది సవరణ అంచనాలు ఎప్పుడు సిద్ధం చేశారని కమిషన్ ప్రశ్నించింది. 2023లో తుది సవరణ అంచనాలను ఆమోదించారని, అదే ఏడాది అనుబంధ ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు. బ్యాంకు గ్యారంటీలు విడుదల చేశారా? అని అడగ్గా 2024లో విడుదల చేశారని బదులిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు