Kaleshwaram Project: కాళేశ్వరం నివేదిక నెలాఖరులోగా!
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:38 AM
కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.
ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించిన పత్రాలను
అధ్యయనం చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్
గ్రౌటింగ్‌కు సాంకేతిక కమిటీ సిఫారసులు తీసుకోవటంపై ఆగ్రహం
ఈఎన్‌సీకి నోటీసులు ఈ నెల 9 లేదా 10న హాజరు
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. సోమవారం జస్టిస్ పీసీ ఘోష్.. కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం అందించిన పత్రాలను ఆయన అధ్యయనం చేసినట్లు సమాచారం. కాగా, తమకు సాంకేతిక సహాయం అందించడం కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులతో.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ చేయడంపై కమిషన్ ఆగ్రహంతో ఉంది.
కమిషన్‌కు సహాయంగా వేసిన కమిటీతో సిఫారసులు తెప్పించుకొని గ్రౌటింగ్ చేయటం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌కు నోటీసులు పంపించింది. ఆయన ఈ నెల 9 లేదా 10వ తేదీన కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీన కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్న జస్టిస్ పీసీ ఘోష్... ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌కు వచ్చి.. ప్రభుత్వానికి నివేదికను అందించనున్నట్లు సమాచారం. కమిషన్‌కు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది.