Justice Priyadarshini: హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని మృతి
ABN , Publish Date - May 05 , 2025 | 03:23 AM
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని 60 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మరణించారు. ఆమె 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు, ఆమె సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు
కొంతకాలంగా అనారోగ్యం.. చికిత్స పొందుతూ కన్నుమూత
చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురి నివాళి
జస్టిస్ గిరిజ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం
పదేళ్లకు పైగా న్యాయవాదిగా సేవలు.. 2008లో జిల్లా జడ్జి
2022లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, మియాపూర్, మే 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని(60) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. జస్టిస్ గిరిజా ప్రియదర్శిని భౌతికకాయాన్న హఫీజ్‌పేటలోని ఆమె స్వగృహానికి తరలించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.
జస్టిస్ గిరిజా ప్రియదర్శినికి భర్త విజయ్‌కుమార్, కుమారులు నిఖిల్, అఖిల్ ఉన్నారు. కాగా, ఏపీలోని విశాఖపట్నంకు చెందిన గిరిజా ప్రియదర్శిని.. అక్కడి ఎన్‌బీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రం పూర్తిచేసి.. 1995లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నంలో పదేళ్లకు పైగా న్యాయవాదిగా పని చేసిన తర్వాత 2008లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్, ఒంగోలు, కరీంనగర్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయసహాయం అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. నాల్సా ఆధ్వర్యంలో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘అకేలే నహీ హై ఆప్’ కార్యక్రమంలో మారుమూల గ్రామాల్లోని అణగారిన వర్గాలకు న్యాయసహాయం అందించడంలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మరణం పట్ల తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకరరావు, ప్రధానకార్యదర్శి మురళీమోహన్ సంతాపం తెలిపారు