Share News

Justice G Radharani: జస్టిస్‌ రాధారాణికి ఘనంగా వీడ్కోలు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:11 AM

హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన జస్టిస్‌ జి. రాధారాణికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు.

Justice G Radharani: జస్టిస్‌ రాధారాణికి ఘనంగా వీడ్కోలు

  • కుల వ్యవస్థపై పోరాడారని ప్రశంసలు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన జస్టిస్‌ జి. రాధారాణికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాల్‌లో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో జస్టిస్‌ రాధారాణి చేసిన సేవలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. ఒక నాస్తికురాలిగా కులవివక్ష, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కులం అనే వ్యవస్థ వల్లే సమాజంలో వివక్ష, అసమానతలు పెరిగిపోతున్నాయని నమ్మి పోరాటం చేశారని పేర్కొన్నారు.


జిల్లా జడ్జిగా సైతం అనేక సంస్కరణలను చేపట్టారని తెలిపారు. హైకోర్టు జడ్జిగా ఐదువేలకు పైగా కేసులు పరిష్కరించడంతోపాటు కీలక తీర్పులు వెలువరించారని పేర్కొన్నారు. జస్టిస్‌ రాధారాణి మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన సవాళ్లను మెట్లుగా మలుచుకున్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి పెద్దగా చదువుకోకపోయినా గొప్ప హేతువాది అని, తనకు, తన సోదరునికి కులాంతర వివాహాలు చేశారని పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ రాధారాణి, సీఎల్‌ఎన్‌ గాంధీ దంపతులను సత్కరించారు.

Updated Date - Jun 28 , 2025 | 04:11 AM