Share News

Jurala Project: జూరాల భద్రత ప్రశ్నార్థకం!

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:51 AM

లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి గ్రీజింగ్‌ లేక గేట్లు కదలకపోవడం, రబ్బరు సీళ్లు పాడైపోవడంతో నీటి లీకేజీలు, గేట్లకు ఉండే రోప్‌లు(ఇనుప తాళ్లు) తుప్పు పట్టి తెగిపోవడం..

Jurala Project: జూరాల భద్రత ప్రశ్నార్థకం!

  • ఏళ్ల తరబడి సాగుతున్న గేట్ల మరమ్మతులు

  • ఎన్‌డీఎ్‌సఏ సూచనలు పట్టించుకోని వైనం

  • ఒక్కటే గ్యాంటీ క్రేన్‌.. తరచూ మొరాయింపే

  • వాహనాల రాకపోకలతో పొంచి ఉన్న ముప్పు

  • రూ.120 కోట్లతో బ్రిడ్జి.. కాగితాలకే పరిమితం

  • ఎడమవైపు కరకట్ట రోడ్డుపై భారీగా గుంతలు

  • చోద్యం చూస్తున్న పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌

  • నేడు ప్రాజెక్టు సందర్శించనున్న మంత్రి ఉత్తమ్‌

  • సేఫ్‌ జోన్‌లోనే మంజీరా బ్యారేజీ జూరాల రోప్‌లకు మరమ్మతులు: రాహుల్‌ బొజ్జా

గద్వాల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి గ్రీజింగ్‌ లేక గేట్లు కదలకపోవడం, రబ్బరు సీళ్లు పాడైపోవడంతో నీటి లీకేజీలు, గేట్లకు ఉండే రోప్‌లు(ఇనుప తాళ్లు) తుప్పు పట్టి తెగిపోవడం.. ఇలా ఒకటీ, రెండు కాదు చాలా సమస్యలు ప్రాజెక్టును పట్టి పీడిస్తున్నాయి. గేట్ల రోప్‌లు బలహీనంగా ఉన్నాయని 2019లో గుర్తిస్తే,2021 వరకు నిధుల కేటాయింపు జరగనే లేదు. చివరకు రూ.11 కోట్లతో టెండర్లు పిలిచినా 2023 వరకు పనులు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. శరవేగంగా చేయాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగదీస్తుండడంతో ఇప్పుడు గేట్ల రోప్‌లు తెగిపోయే పరిస్థితి వచ్చింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తోంది. జూరాల ప్రాజెక్టుపై 62 క్రస్ట్‌ గేట్లు ఉండగా.. వాటిని మరమ్మతు చేసేందుకు ఒక్కటే గ్యాంటీ క్రేన్‌ అందుబాటులో ఉంది. గ్యాంటీ క్రేన్‌లోని మోటార్లు కాలిపోవడం, వేడెక్కడం, క్రేన్‌ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయి. మరో గ్యాంటీ క్రేన్‌ కావాలని అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు. భారీ వరదలు వచ్చినప్పుడు ఏదైనా గేటు మొరాయిస్తే, లేపడానికి గ్యాంటీ క్రేన్‌ కావాలి.


అలాంటి అత్యవసర సమయాల్లో గ్యాంటీ క్రేన్‌ మొరాయిస్తే పరిస్థితి ఏంటనేది అంతుబట్టడం లేదు. అలాగే, జూరాలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించినా.. యథేచ్ఛగా తిరుగుతున్నాయి. గద్వాల, ఆత్మకూరు, మక్తల్‌, నారాయణపేట పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై మరో వంతెన లేకపోవడంతో ఈ ప్రాజెక్టే దిక్కయింది. వాస్తవానికి భారీ వాహనాలతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని ఎన్‌డీఎ్‌సఏ అధికారులు గతంలోనే హెచ్చరించారు. దీంతో రెండేళ్ల క్రితం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లతో ప్రతిపాదనలు పంపినా.. కాగితాలకే పరిమితమైంది. ప్రాజెక్టు పై నుంచి ఇప్పటికీ ఇసుక టిప్పర్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు తిరుగుతుండడం గమనార్హం. అలాగే, ప్రాజెక్టు ఎడమవైపు కరకట్ట రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడగా.. వర్షాల సమయంలో నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో కట్ట బలహీన పడే పరిస్థితి నెలకొంది. గుంతలకు మరమ్మతులు చేపట్టడంలో అటు ఇరిగేషన్‌ శాఖ, ఇటు పంచాయతీ రాజ్‌ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఆరోపణలు న్నాయి. ‘‘ప్రాజెక్టుపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలని, ప్రత్యేకంగా బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించాం. ఒక్కటే గ్యాంటీ క్రేన్‌ ఉండటం ఇబ్బందిగా ఉందని, రెండో క్రేన్‌ కావాలని ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మంజూరైతే ప్రాజెక్టుకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని జూరాల ప్రాజెక్టు ఈఈ జుబేరుద్దీన్‌ తెలిపారు.


నేడు జూరాలకు మంత్రి ఉత్తమ్‌

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి శనివారం జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నారు. రెండు రోజుల క్రితం ప్రాజెక్టులోని 9వ, 12వ క్రస్ట్‌ గేట్ల రోప్స్‌ తెగిపోయిన ఘటనపై మంత్రి సమీక్షించనున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి.. వాస్తవ పరిస్థితిని తెలుసుకోనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఇంజినీరింగ్‌ అధికారులు మరమ్మతు పనులను పర్యవేక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 28 , 2025 | 04:51 AM