Jubilee Hills Land Worth: జూబ్లీహిల్స్‌లో 100 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:14 AM
మహానగరంలోని మరో విలువైన స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి హైడ్రా కాపాడింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు సమీపంలో.. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న 2వేల చదరపు గజాల స్థలంలో....
ప్రజావసరాల స్థలంలో నర్సరీ.. నిర్మాణాలు
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి హైడ్రా
2 దశాబ్దాలుగా ఉన్న ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మహానగరంలోని మరో విలువైన స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి హైడ్రా కాపాడింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు సమీపంలో.. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న 2వేల చదరపు గజాల స్థలంలో ఆక్రమణలను సోమవారం తొలగించింది. ఈ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సంస్థ చెబుతోంది. జూబ్లీహిల్స్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీకి చెందిన 2000 చదరపు గజాల స్థలాన్ని ప్రజావసరాల కోసం కేటాయించారు. పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఈ స్థలానికి నకిలీ ఇంటి నంబరుతో నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఆయనపై గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. స్థలాన్ని పలుమార్లు జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా.. సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి స్టేటస్ కో తెచ్చుకున్నాడు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ అక్కడ నర్సరీ నిర్వర్తిస్తున్నాడు. అనుమతి లేకుండా షెడ్లు నిర్మించాడు. దీనిపై ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ప్రజావసరాలకు కేటాయించిన స్థలంలో నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో మరోసారి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేట్‌సకోను కొట్టేసిన న్యాయస్థానం.. చర్యలు తీసుకునేందుకు హైడ్రాకు అనుమతినిచ్చింది. దీంతో రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో చిక్కిన స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక నిర్మాణాలు, నర్సరీని తొలగించారు. హైడ్రా కాపాడిన స్థలమంటూ బోర్డులూ ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలపై జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడినందుకు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మాదాపూర్‌లో రూ.400 కోట్ల విలువైన 16 వేల చదరపు గజాల స్థలాన్ని హైడ్రా పరిరక్షించిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News