Jr NTR Petition: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూ. ఎన్టీఆర్.. వ్యక్తిగత హక్కుల రక్షణ కోరుతూ పిటిషన్
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:43 PM
తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కోరుతూ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తగు చర్యలు తీసుకోవాలని ఈకామర్స్, సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కామర్స్ సైట్స్, సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్.. ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉందని న్యాయవాది సాయి దీపక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు (Protection of Personality and Publicity Rights).
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా కీలక ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్‌ను ఐటీ నిబంధనలు -2021 కింద ఈ-కామర్స్ వేదికలు, సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదుగా పరిగణించాలని పేర్కొన్నారు. మూడు రోజులలోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు.
గతంలో ప్రముఖ నటులు నాగార్జున, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఇదే విధమైన రక్షణను కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ ఫొటోలు, పేర్లు, వీడియోలను అనుమతి లేకుండా ఇతరులు వినియోగించరాదని కోర్టు ద్వారా ఆదేశాలు పొందారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే తరహా రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వాణిజ్య అంశాల్లో కూడా తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించరాదని పిటిషన్‌ను దాఖలు చేశారు.
సోషల్ మీడియా వినియోగం విస్తృతమైన నేటి జమానాలో పెడ పోకడలు మితిమీరిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖుల ఫొటోలు, ప్లేరు, ఇతర వివరాలతో కొందరు సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. ఏఐని వినియోగిస్తూ కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు న్యాయపరమైన రక్షణలు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
For More TG News And Telugu News