జేఎన్‌టీయూలో ఇకపై వారానికి 5 పనిదినాలే!
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:18 AM
జేఎన్‌టీయూ నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే డా. కిషన్‌కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో పనిదినాలను వారానికి ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని నిర్ణయించారు.
ఉద్యోగుల కోరిక మేరకు కొత్త వీసీ నిర్ణయం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే డా. కిషన్‌కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో పనిదినాలను వారానికి ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. బుధవారం నూతన వీసీ కిషన్‌కుమార్ రెడ్డిని కలిసి పలువురు ఉద్యోగ, అధికారుల సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. 2008 తర్వాత జేఎన్‌టీయూకు వీసీలుగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొందరు జేఎన్‌టీయూ విధానాలను తుంగలోకి తొక్కి, అక్కడి విధానాలను అమలు చేసిన విషయాన్ని కొత్త వీసీ దృష్టికి తెచ్చారు.
ఉద్యోగుల ప్రతిపాదనలను పరిశీలించి 2008కి ముందు ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వర్సిటీ రిజిస్ట్రార్‌కు నూతన వీసీ కిషన్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ విధానం వల్ల యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పాలేరు, మహబూబాబాద్, వనపర్తి, సిరిసిల్ల, సుల్తాన్‌పూర్ కళాశాలల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలవుతుందని, దీంతో ఉద్యోగులు మెరుగైన సేవలు అందిస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత జేఎన్‌టీయూ ప్రొఫెసరే వీసీగా రావడంతో తమకు మరింత మేలు జరుగుతుందని ఉద్యోగులు, ఆచార్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.