Autonomous Colleges: అటానమస్ కాలేజీలకు రిలీఫ్
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:03 AM
జేఎన్టీయూ ఇటీవల విడుదల చేసిన కోర్సుల అమరిక, సిలబ్‌సలో స్వయంప్రతిపత్తి (అటానమస్ హోదా) కల ఇంజనీరింగ్ కాలేజీలు గరిష్ఠంగా 20 శాతం మార్పులకు అనుమతించింది.
కోర్సు సిలబ్‌సలో 20% సవరణకు జేఎన్టీయూ ఓకే
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూ ఇటీవల విడుదల చేసిన కోర్సుల అమరిక, సిలబ్‌సలో స్వయంప్రతిపత్తి (అటానమస్ హోదా) కల ఇంజనీరింగ్ కాలేజీలు గరిష్ఠంగా 20 శాతం మార్పులకు అనుమతించింది. ఆయా కాలేజీల అభ్యర్థన మేరకు యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కళాశాల కొన్ని కోర్సుల ఉప-డొమైన్‌లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నా.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినా.. సంబంధిత కోర్సు ఫలితాలకనుగుణంగా సిలబస్ సవరించుకోవచ్చు. విద్యార్థులకు సమగ్ర శిక్షణకు సంస్థ బలాలు, విలువైన వనరుల వినియోగానికి వీలుగా ఆయా కాలేజీలు ఇటువంటి మార్పులు చేసుకోవచ్చునని జెఎన్‌టియు అధికారులు తెలిపారు. సంబంధిత అటానమస్ కళాశాలల అధ్యయన మండళ్లలో యూనివర్సిటీ నామినీలుగా ఉన్న రెగ్యులర్ ఆచార్యులకు జేఎన్టీయూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇవి మార్గదర్శకాలు
స్వయంప్రతిపత్తి గల కళాశాలలు తమ సంస్థ కోర్సుల శీర్షికలనూ మార్చుకోవచ్చు. విశ్వవిద్యాలయం సూచించిన శీర్షికలను.. సంబంధిత సంస్థ-స్థాయి (స్టాండింగ్) కమిటీలు సిఫారసు చేసిన వాటితో భర్తీ చేయొచ్చు. కళాశాలల అధ్యాపకులకు ఒకే విధమైన పని భారం ఉండేలా కోర్సులను మార్చుకోవచ్చు. ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఔట్‌కమ్ (నిర్దిష్ట ఫలితాల)ను మరింత సమర్థవంతంగా తీర్చి దిద్దడానికి ఈ వెసులుబాటు వీలు కల్పిస్తుంది. నిబంధనల ప్రకారం చేసే ప్రతి మార్పునకు స్పష్టమైన సమర్థన, హేతుబద్ధత కనబర్చాలి. ఆయా కోర్సుల్లో ప్రతిపాదిత మార్పులను బోర్డు ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) ముందుంచి చర్చించాలి. కోర్సుల అమరిక, సిలబ్‌సలో మార్పులు 20 శాతం పరిమితికి లోబడే ఉన్నాయని నిరూపణకు అంశాల వారీగా సారాంశ పట్టికను సిద్ధం చేసుకోవాలని అటానమస్ కళాశాలల ప్రిన్సిపాళ్లను జేఎన్టీయూ ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..