ఎన్‌ఐఏ అదుపులో జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:12 AM
జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు జకారియాను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీఫా సంస్థకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శ్రీలంకలో నిర్వహిస్తున్న సభకు వెళ్లేందుకు చెన్నైకి వెళ్లిన ఆయన ఎన్‌ఐఏ అధికారులకు చిక్కారు.

ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి జకారియా
35ఏళ్లుగా వరంగల్‌లో ఉంటూ హోటల్ వ్యాపారం
వరంగల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు జకారియాను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీఫా సంస్థకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శ్రీలంకలో నిర్వహిస్తున్న సభకు వెళ్లేందుకు చెన్నైకి వెళ్లిన ఆయన ఎన్‌ఐఏ అధికారులకు చిక్కారు. వరంగల్‌లో ఉంటున్న జకారియా.. విజయవాడకు చెందిన మరో ఇద్దరితో కలిసి శ్రీలంకకు వెళ్లేందుకు ఈ నెల 25న చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానాశ్రయంలోని ఏఐ ఫేస్ రికగ్నిషన్ స్కానర్ జకారియాను గుర్తించి అధికారులను అలర్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు జకారియాతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
జమాతే ఇస్లామీ అధ్యక్షుడిగా జకారియా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన కదిలికలపై ఎన్‌ఐఏ నిఘా పెట్టింది. ఇటీవల జకారియా ఫోన్ నుంచి ఐదారుసార్లు పాకిస్థాన్‌కు ఫోన్‌కాల్స్ వెళ్లినట్లుగా ఎన్‌ఐఏ గుర్తించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో జకారియా ఎయిర్‌పోర్టులో చిక్కారు. జకారియాతోపాటు అదుపులో తీసుకున్న ఇద్దరిని విచారించి మర్నాడు పంపించారు. పాకిస్థాన్‌లో ఎవరికి ఫోన్ చేశారో వివరాలు సేకరించినట్లుగా తెలిసింది. జకారియాపై ఎలాంటి కేసులు లేకపోవడంతో ఎన్‌ఐఏ అధికారులు అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జకారియా పూర్వీకులు పాకిస్థాన్ నుంచి వలస వచ్చి గుంటూరు జిల్లాలో స్థిరపడ్డారని సమాచారం. 35ఏళ్ల క్రితం వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌కు వలస వచ్చి అద్దె ఇంట్లో ఉండి.. 15 ఏళ్ల క్రితం జాన్‌పీరీలు ప్రాంతానికి మకాం మార్చారు. అద్దె ఇంట్లో ఇద్దరు భార్యలు, తొమ్మిది మంది పిల్లలు, సోదరుడు, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కాగా, జనవరి 25న ఫోన్‌చేసి, తనను పోలీసులు అదుపులో తీసుకుంటున్నారని చెప్పారని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని జకారియా సోదరుడు తెలిపారు.