Jagga Reddy: రాహుల్‌ది బ్రాహ్మణ కుటుంబం
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:53 AM
రాహుల్ గాంధీది.. బ్రాహ్మణ కుటుంబం, హిందూ మతం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు. అయితే రాజకీయం కోసం తమ కులమతాలను ఆ కుటుంబం ఎన్నడూ వాడుకోలేదన్నారు.

ఆయనది హిందూ మతం.. కానీ.. ఆ కుటుంబం కులమతాలకతీతం
రాజకీయం కోసం కులాన్ని వాడలేదు
ఆడ్వాణీని మోదీ ప్రధానిని చేయగలరా?
పీవీని ఐదేళ్లు, మన్మోహన్‌ను పదేళ్లు.. ప్రధానిగా ఉంచిన గుణం సోనియాది
నిన్నగాక మొన్న పుట్టిన వ్యక్తి సంజయ్
విమర్శించేటప్పుడు రాహుల్ కుటుంబ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి: జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీది.. బ్రాహ్మణ కుటుంబం, హిందూ మతం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు. అయితే రాజకీయం కోసం తమ కులమతాలను ఆ కుటుంబం ఎన్నడూ వాడుకోలేదన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన మహా సంగ్రామం లో పాల్గొన్న చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిదని తెలిపారు. రాహుల్‌గాంధీ కులం, మతం ఏంటంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ముత్తాతలు మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూలు మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం చేశారని గుర్తు చేశారు. సహజంగా తండ్రి వారసత్వం కంటే తాత ముత్తాతల వారసత్వం ఇంకా బలమైందనీ.. ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ప్రజల కోసం రాహుల్‌గాంధీ పోరాడుతున్నారన్నారు. ‘‘హిందూ ధర్మం ప్రకారం పెళ్లికి ముందు భార్యది ఏ కులమైనా పెళ్లయిన తర్వాత భర్తది ఏ కులమైతే అదే కులం ఆమెకు వర్తిస్తుంది. ఆ ధర్మం ప్రకారమే సోనియా.. రాజీవ్‌గాంధీని వివాహం చేసుకున్నాక సోనియాగాంధీగా మారారు. హిందూ ధర్మం గురించి కథలు చెప్పే బండి సంజయ్‌కు ఇది కూడా తెలియదా?’’ అని నిలదీశారు. రాజీవ్‌గాంధీ బ్రాహ్మణుడు.. హిందూ మతస్తుడైనప్పుడు సోనియాగాంధీ కూడా హిందూనే అవుతుందని పేర్కొన్నారు.
పెళ్లి కాలేదు కాబట్టే రాహుల్‌కు జంధ్యం లేదు!
‘‘ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్ జహంగీర్ డాండీ. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన మహాత్మాగాంఽధీ వెంట ఉండేవారు. గాంధీ సహచర్యం కారణంగా ప్రజలు ఆయన్ను ఫిరోజ్‌గాంధీగా పిలిచేవారు. ఆయన హిందూ మతాన్ని స్వీకరించి.. హిందూ మత సంప్రదాయాల ప్రకారమే ఇందిరప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు. హిందూ మతం, బ్రాహ్మణ ధర్మం ప్రకారం జవహర్‌లాల్ నెహ్రూతో పాటు ఫిరోజ్ గాంధీ కూడా జంధ్యం ధరించారు’’ అని జగ్గారెడ్డి చెప్పారు. రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీలకూ జంధ్యం ఉండేదన్నారు. రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదు కాబట్టి.. జంధ్యం లేదని, పెళ్లయ్యాక ఆయనా జంధ్యం ధరిస్తారని వివరించారు. ఇందిర, రాజీవ్‌లు దేశం కోసం తమ ప్రాణాలు కోల్పోతే.. రాజీవ్ మరణం తర్వాత సోనియా, రాహుల్‌లు ఏ పదవీ తీసుకోకుండా త్యాగం చేశారని కొనియాడారు. పీవీని ఐదేళ్లు, మన్మోహన్ సింగ్‌ను పదేళ్లు ప్రధానులుగా నిలబెట్టిన గుణం సోనియా, రాహుల్‌గాంధీలదని పేర్కొన్నారు. ఆ పదిహేనేళ్లలో సోనియా, రాహుల్‌లు ప్రధానులు కావాలంటే అడ్డుకునేవారు ఎవరున్నారని ప్రశ్నించారు. బీజేపీలో వాజ్‌పేయీ తర్వాత ఎల్‌కే ఆడ్వాణీ ప్రధాని కావాల్సి ఉన్నా.. ఆయన్ను పక్కన పెట్టి మోదీని ప్రధానిని చేశారన్నారు. ఈ 11 ఏళ్లలో ఆడ్వాణీని ప్రధాని పీఠం మీద కూర్చోపెట్టే ప్రయత్నం మోదీ ఎన్నడైనా చేశారా? అని ప్రశ్నించారు.‘‘రాహుల్, సోనియా త్యాగాల ముందు.. బీజేపీ నేతలు చేసిన త్యాగం ఒక్కటి చెప్పండి? గాంధీ కుటుంబంపై వేలెత్తి చూపే అర్హత మోదీ, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి లేదు’’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే మోదీ, అమిత్‌షాలు పుట్టారని, బీజేపీ కూడా స్వాతంత్రం వచ్చాక పుట్టిన పార్టీనేనని అన్నారు. బండి సంజయ్.. నిన్న మొన్న పుట్టిన నాయకుడని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాత్ర లేని వీరు.. గాంధీ కుటుంబాన్ని విమర్శించే వారయ్యారా అంటూ ధ్వజమెత్తారు.