Jagga Reddy: పోస్టులు వస్తే పొంగిపోను.. లేవని కుంగిపోను
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:57 AM
‘‘నన్ను మాజీ అనొద్దు.. ప్రజెంట్ అనొద్దు.. నాకు నచ్చేది నా పేరే. పోస్టులు వస్తాయ్.. పోతాయ్.. పోస్టులు వస్తే పొంగిపోను.. పోస్టు లేదని కుమిలిపోను..
అన్నింటికీ అతీతమే ‘జగ్గారెడ్డి’
ఎమ్మెల్యే అనో, మాజీ ఎమ్మెల్యే అనో అనేకన్నా జగ్గారెడ్డి అంటేనే ఇష్ట పడతా
పోస్టులు వస్తాయి.. పోతాయి.. జగ్గారెడ్డి పర్మినెంట్
చౌడమ్మతల్లి జాతరలో కళాకారులతో కలిసి సందడి
సంగారెడ్డి టౌన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) :‘‘నన్ను మాజీ అనొద్దు.. ప్రజెంట్ అనొద్దు.. నాకు నచ్చేది నా పేరే. పోస్టులు వస్తాయ్.. పోతాయ్.. పోస్టులు వస్తే పొంగిపోను.. పోస్టు లేదని కుమిలిపోను.. అందుకే మాజీ, ప్రజెంట్ అనే వాటికంటే జగ్గారెడ్డి అనే పేరే పర్మినెంట్’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనసులో మాట పంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్ధనూర్ గ్రామ శివారులో గుట్ట మీద ఉన్న చౌడమ్మ తల్లి జాతరకు గురువారం సీనియర్ కాంగ్రెస్ నేత చెర్యాల ఆంజనేయులుతో కలిసి జగ్గారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జన సందోహం నడుమ చౌడమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఒగ్గు కళాకారులతో కలిసి భక్త జనాన్ని హోరెత్తించారు. కాగా ఒక ఒగ్గు కళాకారుడు ‘‘మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతారని చెప్పగా.. ఆయన పై విధంగా స్పందించారు. గెలిస్తే పొంగిపోయేది లేదని, ఓడితే కుంగిపోయేది లేదని అన్నారు. జగ్గారెడ్డి ఎప్పుడూ జగ్గారెడ్డిగానే ఉంటాడని స్పష్టం చేశారు. చౌడమ్మ తల్లిని దర్శించుకున్న వారికి మంచి జరుగుతుందని అన్నారు. భక్తులు అనేక కోరికలు కోరుకుంటారని.. వెనకా ముందు వారి కోరికలు నెరవేరుతాయని చెప్పారు. మన విశ్వాసం, మన నమ్మకమే మనల్ని బతికిస్తుందని.. ఏ కష్టం వచ్చినా కుంగిపోవడం సరికాదని అన్నారు.