పాపకు 3 లక్షలు.. బాబుకు 5 లక్షలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:01 AM
పొత్తిళ్లలో పసిబిడ్డలను అపహరించి.. రాష్ట్రాలు దా టించి.. వారిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు!

అప్పుడే పుట్టిన చిన్నారుల అక్రమ రవాణా
గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టు!
11 మంది అరెస్ట్.. నలుగురు చిన్నారులను రక్షించిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పొత్తిళ్లలో పసిబిడ్డలను అపహరించి.. రాష్ట్రాలు దా టించి.. వారిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు! గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా రవాణా చేసి ఆడపిల్లలైతే రూ.3 లక్షలకు.. మగపిల్లలను రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, చైతన్యపురి పోలీసుల సహకారంతో ఆ ముఠాకు చెందినవారిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇటీవలే వారు విక్రయించిన నలుగురు పసికందులను(ఇద్దరు పాప లు, ఇద్దరు బాబులు) కాపాడి.. వారిని కొనుగోలు చేసినవారిని సైతం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురం పోలీస్‌స్టేషన్ పరిఽధిలోని బస్టాపు సమీపంలో మంగళవారం ఉద యం.. ఒక పసిపిల్లవాడిని విక్రయిస్తున్నారని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. దాంతో డీసీపీ రమణారెడ్డి, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ జానయ్య బృందం రంగంలోకి దిగింది. చైతన్యపురి పోలీసులతో కలిసి దాడిచేసిన ఆ బృందం.. చిన్నారిని విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుంది. ఆ ముఠాలోని కోల కృష్ణవేణి, సావిత్రి దేవి, సంపత్ కుమార్‌ను పోలీసులు ప్రశ్నించగా వారి అకృత్యాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సావిత్రిదేవి అక్కడి నుంచి ఒక చిన్నారిని అక్రమ రవాణా చేసి చైతన్యపురికి వచ్చింది. నగరంలో ఈ ముఠాను నడిపిస్తున్న సూరారం వాసి కోల కృష్ణవేణి, కొత్తపేటకు చెందిన బట్టు దీప్తి కవాడిగూడకు చెంది న సందీప్ కుమార్.. అక్కడికి చేరుకొని ఆ చిన్నారిని తీసుకున్నారు. ఆ బాబును రూ.4.2 లక్షలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన దంపతులకు విక్రయించడానికి తెప్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అహ్మదాబాద్‌లో ఉండే వందన అనే మహిళ ఈ ముఠాకు నాయకురాలుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆదేశాలతోనే సావిత్రి అహ్మదాబాద్ నుంచి పిల్లలను తెచ్చి కృష్ణవేణి ముఠాకు అందజేసి డబ్బులు తీసుకొని వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
హైదరాబాద్‌లో కృష్ణవేణి కీలకం..
హైదరాబాద్‌లో ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న కృష్ణవేణి గతంలోనూ చిన్నారులను విక్రయిస్తూ గోపాలపురం పోలీసులకు దొరికిపోయింది. బీఎస్సీ చదివిన కృష్ణవేణి.. రవికుమార్ అనే వ్యక్తిని 2019లో పెళ్లి చేసుకుంది. అయితే కృష్ణవేణికి పిల్లలు పుట్టకపోవడంతో ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఒక ప్రైవేటు కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉద్యోగం చేస్తోందామె. ఈ క్రమంలోనే.. పిల్లలు లేని దంపతులు కొందరితో ఆమెకు పరిచయమైంది. ఎవరైనా అమ్మితే పిల్లలను కొనుక్కొని సాదుకోవడానికి తాము సిద్ధమని వారు చెప్పారు. అదే సమయంలో కృష్ణవేణికి సోషల్ మీడి యా ద్వారా.. పిల్లలను విక్రయించే గుజరాతీ మహి ళ వందనతో పరిచయం ఏర్పడింది. చిన్నారులను కొనుక్కొనేందుకు తనకు తెలిసిన కొందరు సిద్ధంగా ఉన్నట్టు కృఽష్ణవేణి వందనకు చెప్పింది. అందుకు అంగీకరించిన వందన.. అహ్మదాబాద్‌కు చెందిన సా విత్రి, సునీతా సుమన్ అనే ఇద్దరు మహిళల ద్వారా కృష్ణవేణికి పసిపిల్లలను చేరవేసేది. పాపకు రూ.1.5 లక్షలు, బాబుకు రూ.2.5 లక్షల చొప్పున వసూలు చేసేది. ఆ పిల్లలను కృష్ణవేణి రెట్టింపు ధరలకు విక్రయించేది. వచ్చిన డబ్బులో వందనకు ఇవ్వాల్సిన డ బ్బును ఆమెకు పంపి.. తాను రూ.50-60 వేలు తీసుకుని, మిగిలిన డబ్బును తన అనుచరులైన దీప్తి, శ్రవణ్‌కుమార్, శారద, సంపత్‌కుమార్‌కు పంచేది. కొంత డబ్బును ఖర్చులకు వినియోగించేది.
పిల్లల స్వాధీనం..
కృష్ణవేణి ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. జనవరి 28న ఒక పాపను విజయవాడకు చెందిన దంపతులకు రూ. 2.7 లక్షలకు విక్రయించినట్లు తేలింది. ఆ తర్వా త ఫిబ్రవరి 4న మరో పాపను సైదాబాద్‌కు చెందిన దంపతులకు రూ. 2.5 లక్షలకు విక్రయించారు. ఫిబ్రవరి 12న ఒక బాబును మహబూబాబాద్‌కు చెంది న వ్యక్తికి రూ.4.8 లక్షలకు అమ్మేశారు. ఫిబ్రవరి 25న మరో బాబును విక్రయించడానికి అహ్మదాబాద్‌ను తెప్పించి.. అంతలోనే దొరికిపోయారు. కాగా, కొనుగోలుదారులకు ఎలాంటి అనుమానం రాకుం డా ఉండేందుకు.. ఆ చిన్నారులకు నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, వారి తల్లిదండ్రులకు సంబంఽధించి నకిలీ ఆధార్‌కార్డులను సైతం సృష్టించేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ముఠాలో కృష్ణవేణి, దీప్తి, సావిత్రిదేవి, శ్రవణ్‌కుమార్, శారద, సంపత్‌కుమార్‌తో పాటు.. చట్ట విరుద్ధంగా చిన్నారులను కొనుగోలు చేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు.