Share News

Inter Exams: ఎస్‌ఎంఎస్‌‌‌తో హాల్‌టికెట్‌

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:13 AM

ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న పలు ఇబ్బందులు, సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించేందుకు సిద్ధమైనట్టు ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

Inter Exams: ఎస్‌ఎంఎస్‌‌‌తో హాల్‌టికెట్‌

  • క్యూఆర్‌ కోడ్‌తో పరీక్ష కేంద్రం వివరాలు

  • పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో.. ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌డెస్క్‌

  • ఫోన్‌ నంబర్‌: 9240205555.. ఇంటర్‌ పరీక్షల్లో కొత్త సంస్కరణలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న పలు ఇబ్బందులు, సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించేందుకు సిద్ధమైనట్టు ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఉదాహరణకు.. ఇప్పటిదాకా హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండేది. అయితేడౌన్‌లోడ్‌ తేదీ ప్రకటించినప్పుడు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు డౌన్‌లోడ్‌కు ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు వచ్చేవి. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటర్‌ బోర్డు నుంచి విద్యార్థుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ లింక్‌ పంపి.. దానిపై క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షల్లో దీనిని విజయవంతంగా అమలుచేశారు. వార్షిక పరీక్షల్లోనూ ఇదే తరహా విధానం అమలు కానుంది. కాలేజీలో ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఈ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. దీనివల్ల.. ఫీజు చెల్లించలేదంటూ హాల్‌టికెట్‌ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టే అవకాశం కాలేజీలకు ఉండదు. అలాగే.. పరీక్ష కేంద్రాల చిరునామాను హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ రూపంలో ముద్రించనున్నారు. దాన్ని స్కాన్‌ చేస్తే చాలు.. జీపీఎస్‌ సాయంతో సులువుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. కాలేజీ పేర్లలో గందరగోళం, చిరునామా వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఏటా చాలా మంది విద్యార్థులు మొదటిరోజున పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకుని.. లోపలికి అనుమతించకపోవడం వల్ల నష్టపోతున్నారు. ఆ సమస్యను ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానం తీర్చనుంది.


ప్రాక్టికల్స్‌కు సీసీ కెమెరాలు..

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలంటే అంతా కాలేజీల్లోనే మేనేజ్‌ చేసుకుంటారనే భావన ఇప్పటివరకూ ఉండేది. ఈసారి అలాంటి ఆరోపణలు రాకుండా.. అన్ని ప్రాక్టికల్‌ పరీక్షలనూ సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహించారు. దీన్ని తొలుత ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. తర్వాత అయిష్టంగానే అంగీకరించాయి. దీంతో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించే చోట సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, జిల్లా కేంద్రంతోపాటు ఇంటర్‌ బోర్డులో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పర్యవేక్షించారు. ఫలితంగా ప్రాక్టికల్‌ పరీక్షల్లో అవకతవకలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో.. వార్షిక పరీక్షలు జరిగే అన్ని సెంటర్లవద్దా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రశ్నాపత్రాల కవర్లు తొలగించడం కూడా కెమెరాల నిఘాలోనే జరగనుంది.


ఫిర్యాదు చేయండి..

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈసారి హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. దాని ఫోన్‌ నంబర్‌.. 9240205555. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఇది పనిచేస్తుంది. దీనికి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారాల వివరాలను ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. పరీక్షల్లో కీలకపాత్ర పోషించే ప్రధాన పర్యవేక్షకులు (సీఎస్‌), శాఖాధికారులు (డీవో) విధుల కేటాయింపులోనూ ఈసారి మార్పులు చేస్తున్నారు. గతంలో వీరి నియామకంలో ఆరోపణలు వచ్చేవి. కొన్ని ప్రైవేటు కాలేజీలకు లబ్ధి కలిగేలా కొందరు సీఎ్‌సలు, డీవోలు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వచ్చేవి. దీంతో ఈసారి వీరి నియామకంలోనూ మార్పులు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..

ఇంటర్‌ పరీక్షలపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ విశ్వాసం పెంచడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నాం. దేశంలోనే.. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలన్నీ సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేశాం. వార్షిక పరీక్షల్లోనూ సీసీటీవీ కెమెరాలను వినియోగిస్తాం. పరీక్షలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికి తెలంగాణ తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

- కృష్ణ ఆదిత్య, ఇంటర్‌ విద్య కార్యదర్శి

Updated Date - Feb 24 , 2025 | 04:13 AM