Share News

Inter Board: తెలుగుకు ద్రోహం.. ‘జయప్రద’ంగా సంస్కృతం!

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:43 AM

ఇంటర్‌లో ద్వితీయభాషగా తెలుగును ఎత్తివేసి సంస్కృతాన్ని తేవాలన్న ఇంటర్‌ బోర్డు ఆలోచన వెనక ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్కృతాన్ని రెండో భాషగా బోధిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 15 మాత్రమే ఉన్నాయి.

Inter Board: తెలుగుకు ద్రోహం.. ‘జయప్రద’ంగా సంస్కృతం!

ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా సొంత నిర్ణయం.. ఇంటర్‌ బోర్డులో ఓ అధికారి అత్యుత్సాహం

  • ఆమె ఉత్తర్వులను ప్రశ్నించని ఉన్నతాధికారులు

  • ఏడాదిన్నరగా ఆమెకు రెండు కీలక పదవులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌లో ద్వితీయభాషగా తెలుగును ఎత్తివేసి సంస్కృతాన్ని తేవాలన్న ఇంటర్‌ బోర్డు ఆలోచన వెనక ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్కృతాన్ని రెండో భాషగా బోధిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 15 మాత్రమే ఉన్నాయి. వీటి వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఆ ఉన్నతాధికారి భిన్నమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని అమలు చేయాలని, కావాల్సిన పోస్టుల వివరాలు తెలపాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. వరంగల్‌ ఆర్జేడీ హోదాలో ఈనెల 8న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆమె పంపిన ఆదేశాలు ఇంటర్‌లో తెలుగుకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వరకు అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని రెండు నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో రాష్ట్రంలో తెలుగు భాష వెలుగుతుందని విద్యావేత్తలు సంతో షించారు. అంతలోనే.. ఇంటర్లో ద్వితీయ భాషగా ఉన్న తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈనెల 8న ఇంటర్‌ బోర్డు విడుదలచేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 436 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుండగా.. వాటిలో రెండో భాషగా సంస్కృతాన్ని బోధిస్తున్నది 15 కాలేజీల్లోనే. కొన్ని కాలేజీల్లో ఉర్దూ, హిందీలను రెండో భాషగా బోధిస్తుండగా.. 400 కాలేజీల్లో రెండో భాషగా తెలుగును బోధిస్తున్నారు. ఇంటర్‌లో.. సంస్కృతం పేపర్‌లో గరిష్ఠంగా 99 మార్కుల దాకా వేస్తుండటం, తెలుగుకు తక్కువ మార్కులు వస్తుండడంతో చాలా మంది విద్యార్థులు సంస్కృతాన్నే రెండో భాషగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని బోధించేవి తక్కువగా ఉండడంతో ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వ కాలేజీల్లో తెలుగుతోపాటు సంస్కృతాన్ని కూడా ప్రవేశపెడితే ద్వితీయభాషగా తెలుగు తీసుకునే వారే ఉండరనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే సర్కారు వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశోధించగా.. ఇంటర్‌ బోర్డులో రెండు కీలక పదవుల్లో ఉన్న ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహమే దీనికి కారణమని తెలిసింది.


మెమోల్లో లేకున్నా..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టేందుకు, కావాల్సిన సంస్కృత జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి వివరాలు పంపాలని ఇంట ర్‌ బోర్డు వరంగల్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో జయప్రద బాయి ఈనెల 8న ఆదేశాలు జారీచేశారు. దీనికి రెఫరెన్సుగా రెండు పాత మెమోలను ప్రస్తావించారు. ఒకటి నిరుడు ఆగస్టు 27న ప్రభుత్వం విడుదలచేసిన మెమో, మరొకటి ఈ ఏడాది మార్చి 29న ఇంటర్‌ విద్య సంచాలకులు జారీచేసిన మెమో. ఈ రెండు మెమోలనూ పరిశీలించగా.. కొత్తగా ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని అమలుచేయాలనిగానీ, సంస్కృత జేఎల్‌ పోస్టులు సృషించాలనిగానీ లేదు. అయినా జయప్రదబాయి ఆ ఆదేశాలిచ్చారు. వీటి ఆధారంగానే.. అన్ని కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఆ ఉత్తర్వులను ఇంటర్‌ విద్య సంచాలకులుగానీ, విద్యా శాఖ కార్యదర్శి గానీ ప్రశ్నించలేదు. చాలాకాలంగా వరంగల్‌ ఆర్జేడీగా కొనసాగుతున్న జయప్రదబాయికి 2023 అక్టోబరులో పరీక్షల నియంత్రణాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె ఏడాదిన్నరకుపైగా హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 33 జిల్లాల ఇంటర్‌ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలను పర్యవేక్షించాల్సిన కీలక బాధ్యత వరంగల్‌ ఆర్జేడీపై ఉంటుంది. మరోవైపు పరీక్షలకు సంబంధించిన కీలక పదవి కూడా నిర్వహిస్తున్నారు. సమర్థులైన, సీనియర్‌ అధికారులున్నా.. ఆమెను రెండు కీలక పదవుల్లో నియమించడాన్ని బోర్డులోని ఇతర అధికారులు వ్యతిరేకిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 03:43 AM