Weather Update: మరింత ముదిరిన ఎండలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:03 AM
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి, చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా ఉన్నాయి. వడదెబ్బతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు
రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమంటున్న భానుడు
చాలా చోట్ల 43 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
వడదెబ్బతో ఐదుగురు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరింత ముదురుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలు మంటలు పుట్టిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలుచోట్ల మాత్రం సాయంత్రానికి మబ్బులు కమ్ముకుని వాతావరణం కాస్త చల్లబడుతోంది. మరో రెండు రోజులు వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గోదూర్‌లో 44.4 డి గ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 44.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలకుపైగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగానే ఉన్నాయి.
వడదెబ్బతో పెరుగుతున్న మరణాలు
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు వడదెబ్బకు బలయ్యారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరీనగరానికి చెందిన రైతు కేలోత్ రంగ్యా (52) మంగళవారం పొద్దంతా పొలం పనులు చేయడంతో వడదెబ్బకు గురై మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో ఇల్లిల్లూ తిరుగుతూ కూరగాయలు అమ్మే యాకర సాలమ్మ (65), సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌లో ఉపాధి పనులు చేస్తూ వడదెబ్బకు గురైన తలారి నర్సయ్య (59), నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌కు చెందిన వ్యవసాయ కూలీ ఏసిక అర్చన (53), ఖమ్మం జిల్లా మణుగూరు మండలం దమ్మక్కపేటకు చెందిన బిల్లా మంగమ్మ (78) వడదెబ్బకు గురై మృతిచెందారు.