Share News

లీజు పెంచుతున్నాం!

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:52 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థలకిచ్చిన భూముల లీజును పెంచాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయించింది.

లీజు పెంచుతున్నాం!

  • కేంద్ర ప్రభుత్వ సంస్థలకు జయశంకర్‌ వర్సిటీ లేఖలు

  • 12 సంస్థలకు 600 ఎకరాలిచ్చిన వ్యవసాయ విశ్వవిద్యాలయం

  • లీజు రూ.10వేలకు పెంచాలని పాలకమండలి యోచన

రాజేంద్రనగర్‌, జనవరి17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సంస్థలకిచ్చిన భూముల లీజును పెంచాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ వర్సిటీకి సంబంధించిన భూములను లీజుకు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య నేతృత్వంలోని పాలకమండలి లేఖలు రాసింది. ఎప్పుడో 30,40 ఏళ్ల కిత్రం ఎకరాకు రూ5, రూ.10 చొప్పున వర్సిటీ భూములను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లీజుకు ఇచ్చారు. సుమారు 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 600 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఈ లీజును ఎకరాకు రూ. 10వేలకు పెంచాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అదే విషయాన్ని లీజు పొందిన సంస్థలకు తెలుపుతూ లేఖలు రాసింది.


ప్రతి ఐదేళ్లకు ఒకసారి లీజు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే సంవత్సరానికి రూ.60 లక్షల ఆదాయం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వస్తుందని, దీంతో వర్సిటీలో విద్యా, పరిశోధన, విస్తరణ రంగాల అభివృద్ది తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవచ్చని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. వర్సిటీ భూములను లీజుకు తీసుకున్న వాటిలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(నార్మ్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రీసెర్చ్‌ (ఐఐఓఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌) తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి.

Updated Date - Jan 18 , 2025 | 04:52 AM