కన్నతండ్రిని చంపిన కొడుకు
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:27 AM
ఓ యువకుడు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కన్నతండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. దాదాపు 12 సార్లు విచక్షణారహితంగా పొడిచి తండ్రి ప్రాణం తీశాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది.

కత్తితో పొడిచి హత్య
పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
ఏఎ్‌సరావునగర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కన్నతండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. దాదాపు 12 సార్లు విచక్షణారహితంగా పొడిచి తండ్రి ప్రాణం తీశాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45)కి భార్య లావణ్య, కొడుకు సాయికుమార్(25), కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ వలస వచ్చిన ఈ కుటుంబం లాలాపేటలో నివాసముంటోంది. సాయికుమార్ ఇంటర్ వరకు చదివాడు. తండ్రీకొడుకులు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలో పని చేస్తున్నారు. అయితే, మద్యానికి బానిసైన మొగలి.. కుటుంబసభ్యులను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. తండ్రి తీరుతో సాయికుమార్ విసిగిపోయాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం కూడా మొగిలి డబ్బు కోసం ఇంట్లో గొడవపడ్డాడు. అనంతరం లాలాపేటలో సిటీబస్సు ఎక్కి ఈసీఐఎల్‌కు బయలుదేరాడు. ్ల ఆవేశంలో ఉన్న సాయికుమార్.. ద్విచక్రవాహనంపై బస్సును అనుసరించాడు. కుషాయిగూడ పోలీసుస్టేషన్‌కు సమీపంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో బస్సు దిగిన తండ్రిపై దాడి చేశాడు. రోడ్డుపై పడేసి వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. దాదాపు 12 కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉన్న మొగిలిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే మొగలి చనిపోయాడు. ఇక, నిందితుడు సాయికుమార్‌ను పోలీసులు ఘటనాస్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.