కొలువుల పేరిట వల వేసి.. కిడ్నీ మార్పిడి దందా
ABN , Publish Date - May 30 , 2025 | 05:15 AM
వారు ఉద్యోగాల పేరిట తమిళనాడులోని పేదలకు వల విసురుతారు. అటుపై వారి అవసరాలేమిటో తెలుసుకుంటారు.
ఇద్దరు దళారుల అరెస్ట్.. పరారీలో మరో ఏడుగురు.
హైదరాబాద్/ చాదర్‌ఘాట్, మే 29 (ఆంధ్రజ్యోతి): వారు ఉద్యోగాల పేరిట తమిళనాడులోని పేదలకు వల విసురుతారు. అటుపై వారి అవసరాలేమిటో తెలుసుకుంటారు. హైదరాబాద్‌కు రప్పించి వారితో బలవంతంగా కిడ్నీ మార్పిడి చేయిస్తారు. వారిని కిడ్నీని అవసరమైన వారికి అమర్చినందుకు రూ.10లక్షలు తీసుకుంటారు. కిడ్నీ ఇచ్చిన వారికి రూ.4 లక్షలు ఇచ్చి, మిగతా సొమ్ము ఈ దళారులు స్వాహా చేస్తారు. ఇలా కొత్తపేటలోని అలకనందా ఆస్పత్రిలో అక్రమ కిడ్నీ మార్పిడి దందా జరుగుతున్న విషయం తెలిసిన సరూర్‌నగర్ పోలీసులు.. గత జనవరిలో ఆ ఆస్పత్రిపై దాడి చేసి 13మందిని అరెస్ట్ చేసి, సదరు హాస్పిటల్‌ను సీజ్ చేశారు.
అవయవాల మార్పిడి అంశం కావడంతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ పోలీసులు.. దందాలో తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్య పాత్ర ఉన్నట్లు గుర్తించారు. చెన్నైలో గురువారం వారిద్దరిని అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈకేసుతో సంబంధం ఉన్న జననీ ఆస్పత్రిని సీజ్ చేశారు. పరారీలో ఉన్న పవన్, పూర్ణచంద్రరావులతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐడీ డీజీ షికాగోయల్ తెలిపారు.