Share News

Tollywood : కార్మికుల వేతనాల పెంపుపై 4 షరతులతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ఫిల్మ్‌ఛాంబర్‌ లేఖ

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:35 AM

సినీ కార్మికుల వేతనాల పెంపుపై జరుగుతున్న చర్చలు క్రమక్రమంగా కొలిక్కివస్తున్నాయి. 4 షరతులు, పర్సంటేజీ విధానాన్ని వివరిస్తూ ఫిల్మ్‌ ఛాంబర్‌.. ఫిల్మ్ ఫెడరేషన కు ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రేపు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సమావేశం కానుంది.

Tollywood : కార్మికుల వేతనాల పెంపుపై 4 షరతులతో  ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ఫిల్మ్‌ఛాంబర్‌ లేఖ
Tollywood

హైదరాబాద్, ఆగస్టు 17 : సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు క్రమక్రమంగా కొలిక్కివస్తున్నాయి. 4 షరతులు, పర్సంటేజీ విధానాన్ని వివరిస్తూ ఫిల్మ్‌ ఛాంబర్‌.. ఫిల్మ్ ఫెడరేషన కు ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు 24 క్రాఫ్ట్స్ సినిమా సంఘాలతో రేపు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫిల్మ్‌ఛాంబర్‌ పెట్టిన షరతులపై రేపు ఫిల్మ్ ఫెడరేషన్‌ చర్చించనుంది. ఇలా ఉండగా తాజా పరిణామాలపై , సినీ నడుటు చిరంజీవితో ఇరు వర్గాలు సమావేశమైనట్టు తెలుస్తోంది.

కాగా, సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, కార్మిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు.


ఈ చర్చల్లో ఫెడరేషన్ త‌ర‌పున‌ కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు తమ వాణి వినిపించారు. కార్మికుల తరఫున వీరు తమ సమస్యలను, ముఖ్యంగా వేతనాల పెంపు విష‌యంపై దిల్ రాజు, ఇతర నిర్మాతల ముందు తమ ప్రతిపాదనల్ని ప్రస్తావించారు.

ఇక, ఈ సమావేశానికి నిర్మాతల తరఫున భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, వివేక్ కూచిభట్ల వంటి ప్రముఖులు హాజరయ్యారు. సినీ నిర్మాణ ఖ‌ర్చులు పెరిగిపోవడం, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై నిర్మాతలు తమకు ఎదురవుతున్న సమస్యల్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి వెసులుబాట్లతో ముందుకు వెళ్తుందనేది తేలాల్సి ఉంది. రేపటి సమావేశంలో దాదాపు సమస్య పరిష్కారానికి తమ వంతుగా ఎలాంటి నిర్ణయాలు చేస్తారనేది చూడాలి.


ఇవి కూడా చదవండి

మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..

Updated Date - Aug 17 , 2025 | 11:36 AM