Ponnam Prabhakar: నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు: రవాణా మంత్రి పొన్నం
ABN , Publish Date - Nov 12 , 2025 | 07:39 PM
ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల వారిని వేధించ వద్దని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు, ఓవర్ స్పీడ్ వాహనాలతోపాటు సీసీ బస్సులు సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 12: రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్, రాష్ట్ర స్థాయిలో 3 ప్లెయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేపడుతున్నట్లు వివరించారు. అందులోభాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓవర్ లోడింగ్ వాహనాలు సీజ్, పెనాల్టీతో పాటు ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని వివరించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు వివిధ ప్రాంతాల నుంచి సమాచారం అందుతుందని చెప్పారు. శాండ్, ఫ్లై యాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్ తరలించే వాహనాలను ప్రత్యేకంగా తనిఖీలు చేపడతామన్నారు. అందుకోసం డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐలతో కూడిన బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అయితే ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల వారిని వేధించ వద్దని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు, ఓవర్ స్పీడ్ వాహనాలతోపాటు సీసీ బస్సులు సీజ్ చేయాలని స్పష్టం చేశారు. జేటీసీ, డీటీసీలు ప్రతి వారం రెండుసార్లు అంతర్రాష్ట్ర సీసీ బస్సులను తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
టిప్పర్లు, ట్రాలీలు టార్పాలిన్‌తో కప్పకుండా వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. గత వారం చేవెళ్ల ప్రమాదం తర్వాత 2,576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో 352 లారీలు, 43 బస్సులు ఉన్నాయని వివరించారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు వేగవంతం చేయాలని.. సిబ్బందికి శిక్షణ బాట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉపాధి అవకాశాల కోసం మహిళా ఆటోలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు, వ్యాస రచన పోటీలు, చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్క్‌ల వద్ద చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.