Telangana TET, AP DSC: ఒకే తేదీల్లో తెలంగాణ టెట్.. ఏపీ డీఎస్సీ.. ఇరకాటంలో అభ్యర్థులు...
ABN , Publish Date - Jun 06 , 2025 | 07:55 AM
Telangana TET, AP DSC: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కొత్త ఇరకాటం వచ్చిపడింది. తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ జరుపుతోంది. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు.
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు (Unemployed Teacher candidates) కొత్త ఇరకాటం వచ్చిపడింది. తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ (TET))లను నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం (AP Govt) జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ (DSC) జరపనుంది. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను ఈ నెల 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఏపీ డీఎస్సీ..
సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. సగటున ఒక్కో పోస్టుకు 35.33 మంది పోటీపడుతున్నారు. వారికి ఈ నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. కంప్యూటర్ ఆధారంగా జరగనున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో 150 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, బరంపురం, బెంగళూరుల్లో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల కోసం 5 జిల్లాలను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోగా 87.8 శాతం మందికి మొదటి ఆప్షన్ జిల్లాలోనే పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆగస్టు రెండో వారంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు.
ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి..
కాగా నాన్ లోకల్ కింద 20 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 7 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. అయితే కొన్ని తేదీల్లో ఒకేరోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్‌సీ పరీక్షలు ఉండటంతో వందల మంది అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరికి హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా.. మరికొందరు ఏపీ వెళ్లి రాయాల్సి ఉంది. ముఖ్యంగా 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్-1.. అటు ఏపీ డీఎస్‌సీలో ఎస్‌జీటీ పోస్టులకు పరీక్ష ఉండటం సమస్యగా మారింది. ఇరు ప్రభుత్వాలు చర్చించుకొని.. రెండు పరీక్షలు ఒకేరోజు లేకుండా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ తేదీలు మారని పక్షంలో టెట్ ఏటా రెండుసార్లు జరుగుతుందని, డీఎస్సీ అరుదుగా నిర్వహిస్తారన్న ఆలోచనతో కొందరు అభ్యర్థులు టెట్‌ను వదులుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ సాధించిన అతిపెద్ద ఘనత ఏంటంటే..
For More AP News and Telugu News