Share News

Massive Investments in Telangana: రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:41 AM

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు సలక్షణంగా రైజింగ్‌ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్‌ సదస్సు వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు...

Massive Investments in Telangana: రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
Telangana Rising Summit 2025

  • రాష్ట్రంలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు 14 కంపెనీలు సిద్ధం.. 70 వేల కోట్లతో టీసీఎ్‌స-టీపీజీ డేటా కేంద్రాలు

  • రూ.70 వేల కోట్లతో టీసీఎ్‌స-టీపీజీ డేటా కేంద్రాలు

  • హ్యుందాయ్‌ కార్ల ఫ్యాక్టరీ, 25 బయోగ్యాస్‌ ప్లాంట్లు

  • ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులకు పరిశ్రమల ఆసక్తి

  • తెలంగాణ రైజింగ్‌ సదస్సులో ప్రకటించనున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పెట్టుబడులు స‘లక్ష’ణంగా రైజింగ్‌ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్‌ సదస్సు వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 కంపెనీలు ముందుకొచ్చాయి. మరో 30కిపైగా ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గుజరాత్‌ జామ్‌నగర్‌లో రిలయన్స్‌ గ్రూప్‌ అభివృద్ధి చేసిన వంతారా జూ మన ఫ్యూచర్‌ సిటీలోనూ ఏర్పాటుకానుంది.. ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70వేల కోట్ల (8 బిలియన్‌ డాలర్ల)తో అత్యాధునిక హైపర్‌వాల్ట్‌ డేటా సెంటర్లను స్థాపించనుంది.

ఇవేకాదు.. పరిశ్రమలతోపాటు పర్యాటకం, క్రీడలు, వినోద రంగాల్లోనూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం అందులో బుధవారం నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సదస్సు ప్రారంభానికి మరో 4-5 రోజుల సమయం ఉండటంతో.. కంపెనీల సంఖ్య, పెట్టుబడుల మొత్తం మరింత భారీగా పెరగనుంది. ఈనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయు) కుదుర్చుకోనున్నాయి.


విదేశీ కంపెనీలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు..

ఫ్యూచర్‌ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ కంపెనీలు కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో తైవాన్‌, సింగపూర్‌, వియత్నాం కంపెనీల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడలు (ఇండస్ట్రియల్‌ పార్కులు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రాన్ని అంతర్జాతీయ సినిమాలకు కేంద్రంగా మార్చాలన్న సీఎం రేవంత్‌ ఆలోచన సాకారం కానుంది. ఫ్యూచర్‌సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ ముందుకొచ్చారు. పెట్టుబడుల మొత్తం ఎంతనేది ప్రకటించాల్సి ఉంది. సీతారాంపూర్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్న హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ కూడా పెట్టుబడుల మొత్తాన్ని వెల్లడించనుంది.

ఏఐ యునివర్సిటీ, విదేశీ క్యాంపస్‌..

ఏఐ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఏఐ యునివర్సిటీ ఏర్పాటుకు అనుమతించింది. ప్రజ్ఞా ఏఐ సంస్థ ప్రజ్ఞా ఏఐ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది. అలాగే లండన్‌ యూనివర్సిటీ తన ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సను నగరంలో ఏర్పాటు చేయనుంది. ఇవేగాక మరెన్నో ఐటీ, పర్యాటకం, క్రీడలు, సినిమా, ఉన్నత విద్యారంగంలో పెట్టుబడులకు సంబంధించిన అనేక ఒప్పందాలు తెలంగాణ రైజింగ్‌ సదస్సులో కుదరనున్నాయి.


పెద్ద సంఖ్యలోతరలిరానున్నవిదేశీ ప్రముఖులు

తెలంగాణ రైజింగ్‌ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నారు. సదస్సులో పాల్గొనాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,800 మందికి ఆహ్వానాలు పంపింది. అందులో అనేకమంది వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, రిలయన్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ట్రంప్‌ మీడియా టెక్నాలజీ గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ స్వీడర్‌, యూఏఈ రాచ కుటుంబానికి చెందిన రస్‌-అల్‌-ఖైమా ప్రతినిధి తారిఖ్‌ అల్‌ ఖాసిమి, సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ మసా గ్రూప్‌ ప్రతినిధి మహమ్మద్‌ అబ్దుల్‌ నయీమ్‌, టీవీఎస్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఆర్‌.దినేశ్‌, ప్రెస్టీజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఇర్ఫాన్‌ రజాక్‌, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి, సన్‌ గ్రూప్‌ సీఈవో కావ్య మారన్‌, హ్యుందాయ్‌ ఎండీ ఉన్సూ కిమ్‌, ఆస్కార్‌ సినీ దర్శకుడు గునీత్‌ మోంగాతోపాటు సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pushpa-2 movie: శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్‌

Greater Hyderabad: విలీనం.. ఇక అధికారికం

Updated Date - Dec 04 , 2025 | 09:16 AM