Share News

MLA Disqualification Case: అనర్హత ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న విచారణ..

ABN , Publish Date - Nov 14 , 2025 | 07:54 PM

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారించారు. అలాగే ఈ విచారణ శనివారం సైతం కొనసాగనుంది.

MLA Disqualification Case: అనర్హత ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న విచారణ..

హైదరాబాద్, నవంబర్ 14: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పిటిషనర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అలాగే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిటిషనర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.


మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం విచారించనున్నారు. తెల్లం వెంకట్రావుకు పిటిషనర్‌గా ఎమ్మెల్యే కేపీ వివేక్ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే సంజయ్‌కి పిటిషనర్‌గా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.


పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ శుక్రవారం అంటే.. నవంబర్ 14వ తేదీన ప్రారంభమైంది. ఇది రేపు సైతం కొనసాగుతుంది. ఈ విచారణ స్పీకర్ సమక్షంలో జరుగుతోంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై జగదీష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కల్వకుంట్ల సంజయ్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.


గతంలో పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన అనంతరం ఈ విచారణ వాయిదా పడింది. వాస్తవానికి నవంబర్ 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న పోచారం, అరికెపూడిని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది.


కానీ స్పీకర్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఈ విచారణ వాయిదా పడింది. దీంతో తిరిగి నవంబర్ 14,15 తేదీల్లో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో సందర్శకులు, మీడియాపై ఆంక్షలు విధించారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించిన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Nov 14 , 2025 | 07:57 PM