Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం
ABN , Publish Date - Jun 04 , 2025 | 10:25 AM
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు రాష్ర్ట ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు వీటిలో విలీనం అయిన గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు, డివిజన్ల పునర్విభజనపై మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి జీవో జారీ చేశారు.
Hyderabad: మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు (Ward Reorganization) సంబంధించి నోటిఫికేషన్ (Notification) మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం అయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు.
త్వరలో రిజర్వేషన్‌లు ఖరారు..
ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా పూర్తికానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి.
పునర్విభజన ఇలా..
కొహిర్, కేసముద్రం, అశ్వరావుపేట, స్టేషన్ ఘనపూర్, మద్దూర్, ఎదులాపురం, దేవరకద్ర, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, ములుగు, బిచ్కుంద, కల్లూరు, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరగనుంది. మహబూబ్ నగర్, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లు, నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోనూ కొత్త వార్డులు ఏర్పాటు కానున్నాయి. కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన తర్వాత జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ కలకలం..
For More AP News and Telugu News