Maoists Surrender: తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:38 PM
దేశ వ్యాప్తంగా పోలీసులకు మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట భారీ స్థాయిలో మావోలు ఆయుధాలు సమర్పించి లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 22: మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 25 మంది మహిళా మావోలు ఉండగా.. 12 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి పలువురు అగ్రనేతలు ఉన్నారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 303 రైఫిల్స్, జీ-3 రైఫిల్స్, AK 47లు, SLRలు, భారీగా బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మావోల లొంగుబాటు సందర్భంగా ఆయన పలు అంశాలు వివరించారు. ఏ రకంగా బయటికి వచ్చినా.. మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని డీజీపీ అన్నారు. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా వచ్చినా, రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా తాము స్వాగతిస్తామని డీజీపీ పేర్కొన్నారు.
మావోయిస్టులు పార్టీ పరంగా విబేధాలు, ఆరోగ్య కారణాలు, ఇలా అనేక కారణాలతో బయటికి వస్తున్నారని డీజీపీ తెలిపారు. 'తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద రూ.20లక్షల రివార్డ్ ఉంది. అప్పాసి నారాయణ మీద రూ.20లక్షలు రివార్డ్ ఉంది. మిగతా వారికి రూ.25 వేలు చొప్పున ఇస్తున్నామని డీజీపీ తెలిపారు. 11 నెలల్లో 465మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 59మంది తెలంగాణకు చెందిన వారని డీజీపీ వెల్లడించారు.
మావోయిస్టు నేతలు దేవ్ జీ, గణపతి లొంగుబాటుకి ప్రయత్నం చేస్తున్నామని కూడా డీజీపీ చెప్పారు. గణపతి, రాజిరెడ్డి, దేవ్‌జీ , గణేష్, విశ్వనాథ్ తెలంగాణకి చెందిన సెంట్రల్ కమిటీ సభ్యులని.. వీళ్లు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని డీజీపీ చెప్పారు. వారు కూడా త్వరలో పోలీసులు ముందుకు లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి