Telangana Cabinet Meet: రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక ప్రకటన చేసే ఛాన్స్!
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:05 AM
రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ కు ఆమోదం వంటి అంశాలపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ మంత్రి వర్గం (Telangana Cabinet) సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. కాగా రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో (Local Body Elections) పాటు భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ చర్చించనుంది. దీంతో ఇటీవల భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్సు కు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే, SLBC పునరుద్ధరణ పనులు, SRSP రెండో దశకు రాంరెడ్డి దామోదర రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్ట్ పనుల పై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం.
మరో పథకానికి శ్రీకారం?..
స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు జరిగే సమావేశంలో మంత్రి వర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. పాత పద్దతిలో ఎన్నికలకు వెళ్లాలా? లేదా 42 శాతం రిజర్వేషన్లతో వెళ్లాలా? అనేది దానిపై కేబినెట్ చర్చించనుంది. కాగా ఇప్పటికే ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయనిపుణ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని న్యాయస్థానాల్లో కొట్లాడేందుకు రేవంత్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు.. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఏ పథకం అమలు చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రేపు రాష్ట్ర మంత్రి వర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుదనేది వేచి చూడాలి.