Share News

Srushti Fertility Clinic Scam: సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో మరో మలుపు.. బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:22 PM

సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు డాక్టర్ నమ్రతపై కేసుల సంఖ్య పెరుగుతుంటే.. మరో వైపు ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది.

Srushti Fertility Clinic Scam:  సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో మరో మలుపు.. బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు
Srushti Fertility Clinic Scam

హైదరాబాద్‌: గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో తాజాగా 6 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు.


బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్‌లోనే 8 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆమెతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యులతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు డాక్టర్ నమ్రతకు చెందిన బ్యాంక్ ఖాతాలు, హాస్పిటల్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో కోట్ల రూపాయల నగదు జమై ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మరికొన్ని ఖాతాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు.


IVF పేరుతో మోసం

ఇప్పటివరకు దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ద్వారా 70కి పైగా భార్యాభర్తలు IVF చికిత్స కోసం వచ్చి, సరోగసి పేరుతో మోసపోయారని పోలీసులు వెల్లడించారు. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌ డాక్టర్ నమ్రత తోపాటు మరికొందరూ చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డట్లు పక్కా ఆధారాలు లభించాయి. గోపాలపురం పోలీసులు మరోసారి సృష్టి హాస్పిటల్‌కి వెళ్లి కీలక డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కేసుకు మద్దతుగా కీలక ఆధారాలుగా మారనున్నాయి. అలాగే, ఈ రోజు మరో కొన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం.


అకౌంట్ల పరిశీలన

నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు డాక్టర్ నమ్రత అనుబంధంగా ఉన్న ఇతర హాస్పిటళ్లను, ఆసుపత్రుల్లోని కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును వేరే అకౌంట్లలోకి మళ్లించి ఉండే అవకాశం ఉన్నందున ఆ దిశగా విచారణ జరుగుతోంది. ఈ కేసు కేంద్రం దృష్టికి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే.. చిన్నారుల అక్రమ రవాణా వంటి విషయాల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించనున్నాయి.


Also Read:

దారుణం.. కన్న కూతురు ముందే అల్లుడిని హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

స్వల్పంగా తగ్గిన బంగారం ధర .. ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Latest News

Updated Date - Aug 06 , 2025 | 01:28 PM