RTA Inspections: ప్రైవేట్ ట్రావెల్స్ వెనకడుగు.. ఆర్టీసీకి ఊహించని గిరాకీ
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:46 PM
ఫిట్‌నెస్ లేని బస్సులను యాజమాన్యాలు నిలిపివేస్తున్న పరిస్థితి. ముందుగా బుక్ చేసిన టికెట్లను కూడా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు రద్దు చేస్తున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 25: కర్నూల్ బస్సు ప్రమాదం తరువాత ఆర్టీఏ అధికారులు (RTA Officers) తక్షణమే చర్యలు చేపట్టారు. ఫిట్‌నెస్ లేని ప్రైవేటు బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు.. 8 బస్సులను సీజ్ చేశారు. మరోవైపు కర్నూల్ ప్రమాదం తరువాత ప్రైవేటు బస్సుల యాజమాన్యాల్లో కూడా చలనం వచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ లేని బస్సులను పెద్ద ఎత్తున నిలిపివేస్తున్న పరిస్థితి. ముందుగా బుక్ చేసిన టికెట్లను కూడా ప్రైవేటు ట్రావెల్స్ రద్దు చేస్తున్నాయి. వీకెండ్ కావడంతో ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణికులు భారీగా బుకింగ్ చేసుకున్నారు.
అయితే ఫిట్‌నెస్ లేని బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టఏ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భారీగా బస్సులను యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా ఆర్టీఏ అధికారులు భారీగా బస్సులను సీజ్ చేస్తున్నారు. తెలంగాణలో వారం రోజులు పాటు స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగునున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పెద్ద ఎత్తున బుకింగ్‌లను రద్దు చేయడంతో ఆర్టీసీకి గిరాకీ పెరిగింది.