Revanth Cabinet: మంత్రులకు శాఖలు కేటయింపు
ABN , Publish Date - Jun 11 , 2025 | 09:19 PM
సీఎం రేవంత్ రెడ్డి.. తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వారికి శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్, జూన్ 11: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయించినట్లు సమాచారం. గడ్డం వివేక్‌కు కార్మిక, క్రీడలు, న్యాయ శాఖలు.. అలాగే వాకాటి శ్రీహరికి పశుసంవర్థక, వాణిజ్య పన్నుల శాఖ.. అడ్లూరు లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం మరి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రుల శాఖ కేటాయింపుపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. ఒక్కో మంత్రికి రెండేసి శాఖలు చొప్పున కేటాయించాలనే ప్రతిపాదనను సీఎస్‌కు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లు సమాచారం.
జూన్ 8వ తేదీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి.. తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ (చెన్నూరు), వాకాటి శ్రీహరి (మక్తల్), అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపూరి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారికి శాఖలు కేటాయించలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రులకు శాఖ కేటాయింపుపై పార్టీ అధిష్టానంతో చర్చించారు. అలాగే రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం మంగళవారం న్యూఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పదవుల కేటాయింపుపై పార్టీ అగ్రనేతలతో ఉత్తమ్ సైతం చర్చించినట్లు తెలుస్తుంది. అనంతరం కొత్త మంత్రుల శాఖల కేటాయింపు అంశం ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.