Share News

Teenmar Mallanna Vs Kavitha: తెలంగాణలో కవితను తిరగనీయం: తీన్మార్ మల్లన్న

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:40 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఆమెను తెలంగాణలో తిరగనివ్వమన్నారు. తనపై జరిగిన దాడి.. యావత్తు బీసీలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

Teenmar Mallanna Vs Kavitha: తెలంగాణలో కవితను తిరగనీయం: తీన్మార్ మల్లన్న
MLC Teenmar Mallanna

హైదరాబాద్, జులై 13: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణలో తిరగనీయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మొన్న మహా టీవీ, నేడు క్యూ న్యూస్ కార్యాలయాలపై దాడి జరిగిందని.. రేపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపైనా దాడి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమపై దాడులు చేయెుచ్చు కానీ.. తమ ఆత్మాభిమానాన్ని చంపలేరన్నారు తీన్మార్ మల్లన్న. ఇది తనపై జరిగిన దాడి కాదని.. యావత్తు బీసీలపై జరిగిన దాడి అని ఈ సందర్భంగా మల్లన్న అభివర్ణించారు.

తాను మాట్లాడిన భాష.. తెలంగాణ మాండలికంలోనే ఉందన్నారు తీన్మార్ మల్లన్న. తాను ఎక్కడా అగౌరవంగా మాట్లాడలేదన్నారు. 40 మంది ఒకేసారి తన కార్యాలయంపై దాడి చేశారని వివరించారు. తనకు, తన సిబ్బందికి రెగ్యులర్‌గా క్యూ న్యూస్‌కు వచ్చే వాళ్లకు గాయాలయ్యాయన్నారు. ఈ దాడిపై ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఉన్నతాధికారులు.. తనకు ఫోన్ చేసి వివరాలు అడిగారని చెప్పారు.


తెలంగాణ జాగృతి కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేశారంటూ మల్లన్న మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందన్నారు. ఇలాంటి చర్యల వల్ల బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే.. అది భ్రమేనని పేర్కొన్నారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందన్నారు. తన గన్‌మెన్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు యత్నించారని ఆరోపించారు.


ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఏ మాత్రం తగ్గదని కుండ బద్దలు కొట్టారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామన్నారు. ఈ తరహా చర్యలకు తాను భయపడనని చెప్పారు. రాసి పెట్టుకోండి.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత తమదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహించారు.


తనపై ఎథిక్స్ కమిటీ సిఫార్స్ చేయాలన్న ఎమ్మెల్సీ కవిత.. ఏ ఎథిక్స్‌తో తమ మీద దాడికి పంపారని తీన్మార్ మల్లన్న సూటిగా ప్రశ్నించారు. తనపై ఎక్కడైనా ఫిర్యాదు చేయండంటూ కవితకు సవాల్ విసిరారు. తమపై దాడి చేసి.. శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ మల్లన్న ప్రశ్నించారు. శాసన మండలి ఛైర్మన్ దాడి చేయమని ఏమైనా చెప్పారా?. బీసీల మీద దాడి చేయమని ప్రోత్సహించారంటూ ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలంటున్న కవిత.. ఆమెనే తన కార్యాలయంపై దాడి చేయమని చెప్పారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కవిత వెనక్కి తగ్గడం కాదు.. రేపటి నుంచి బీసీల తడాఖా ఏమిటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు తీన్మార్ మల్లన్న వార్నింగ్ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

మండలి చైర్మన్ గుత్తా కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

వికసిత్‌ తెలంగాణ బీజేపీకే సాధ్యం


Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2025 | 04:32 PM