Chamala Kiran Kumar Reddy: దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం: ఎంపీ
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:10 PM
హెరాల్డ్ కేసులో పోలీస్, ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు సైతం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) చారిత్రాత్మకమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇలాంటి పథకానికి పేరు మార్చి వికసిత భారత్ - జీ రామ్ జీగా ప్రస్తుతం నామకరణం చేశారని మంగళవారం న్యూఢిల్లీలో ఆయన విమర్శించారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఆర్ఎస్ఎస్ – బీజేపీ ఆలోచనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని బలపర్చకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ నిప్పులు చెరిగారు. కేంద్ర - రాష్ట్ర నిధుల వాటా 40:60గా మార్చడంతో రాష్ట్రాలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రాల్లో నిధులు లేకపోతే పథకం అమలు కష్టమయ్యే పరిస్థితి ఉందన్నారు. 125 రోజులు అంటూనే ఉపాధి హామీని అస్పష్టంగా మార్చారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకానికి దేవుడి పేరు పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. మహాత్మా గాంధీ పేరును చరిత్ర నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు.
ఈ పథకం పేరుతోపాటు అమలులో తీసుకు వచ్చిన మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని ఎంపీ చామల స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు. గ్రామీణ పేద ప్రజలకు 100 రోజుల గ్యారెంటీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి కేంద్రం 100% నిధులు కేటాయించిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో పోలీస్, ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు సైతం స్పష్టం చేసిందని తెలిపారు. రాహుల్, సోనియా గాంధీలపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. బలమైన ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీపై ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.