Weather Report: బాబోయ్ ఎండలు.. పది రోజులపాటు దబిడి దిబిడే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 10:16 PM
హైదరాబాద్‌లో రానున్న రెండ్రోజులపాటు 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పది రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బేంబెలెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గొడుగులు చేతపట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత వేధిస్తోంది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోననే చర్చ మెుదలైంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని, రానున్న పది రోజుల్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వెదర్ మెన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.
తెలంగాణలో మార్చి 19 వరకూ ఇదే విధంగా వేడిగాలులు, ఎండల ప్రభావం ఉంటుందని తెలంగాణ వెదర్ మెన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. అలాగే ఈనెల 20 నుంచి 24 మధ్య ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలిపాడు. మార్చి 20 నుంచి అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. అలాగే వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు సైతం చోటు చేసుకుంటాయంటూ ట్వీట్ చేశాడు. అలాగే అకాల వర్షాలతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రైతులకు మాత్రం నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. పంట నష్టం జరగకుండా రైతన్నలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాడు.
మరోవైపు హైదరాబాద్‌లోనూ రానున్న రెండ్రోజులపాటు 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే మరో 7 జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3.3 సెల్సియస్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..
Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..