TPCC : నేడు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ, రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకొచ్చే అవకాశం
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:09 AM
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నేడు హైదరాబాద్‌లో భేటీ కానుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు, కొండా మురళి..
హైదరాబాద్: ఇవాళ టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు, కొండా మురళి అంశం కూడా కమిటీ చర్చించే అవకాశం ఉందంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ప్రామిస్ విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వేర్వేరుగా ఉండటం కూడా నేటి భేటీ మీద ఉత్సుకతకు కారణమైంది.
మంత్రి పదవి కావాలంటూ రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కమిటీ సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని కోమటిడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస విమర్శలు చేస్తున్నారు. పార్టీ అంటే ఇష్టమే కానీ.. అంటూనే సీఎంపై విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది.
మంత్రి పదవి లభించలేదనే కారణంతో చాలా సార్లు రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వినిపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదు.. దీనిపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాను.. ఇవాళ జరిగే భేటీలో చర్చించిన తర్వాత అన్ని విషయాలు చెబుతాను అని చెప్పారు.
మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మీ జీవితాన్ని మార్చే పంట.. తక్కువ పెట్టుబడితో లక్షల లాభం..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..