Kukatpally Murder Case: ‘మిషన్ డాన్’.. కిల్లర్ బాలుడి లెటర్ చూస్తే హడలిపోవాల్సిందే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:14 PM
వాడి వయసు.. పట్టుమని పదహారేళ్లు కూడా ఉండవేమో.. కానీ, వాడు చేసిన పని మాత్రం సమాజం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. పదవ తరగతి కూడా పూర్తికాని వాడు.. ‘మిషన్ డాన్’ పేరుతో పెద్ద స్కెచ్ వేసి ఓ చిన్నారి ఉసురు తీశాడు. చోరీ కోసం వెళ్లి అబంశుభం తెలియని అమ్మాయిని..
హైదరాబాద్, ఆగస్టు 22: వాడి వయసు.. పట్టుమని పదహారేళ్లు కూడా ఉండవేమో.. కానీ, వాడు చేసిన పని మాత్రం సమాజం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. పదవ తరగతి కూడా పూర్తికాని వాడు.. ‘మిషన్ డాన్’ పేరుతో పెద్ద స్కెచ్ వేసి ఓ చిన్నారి ఉసురు తీశాడు. చోరీ కోసం వెళ్లి అబంశుభం తెలియని అమ్మాయిని విచక్షణారహితంగా కొత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. 20 కత్తిపోట్లు పొడిచాడంటే వాడిలో ఎంతటి క్రూరత్వం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎవరిగురించో కాదు.. కూకట్‌పల్లిలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న చిన్నారి దారుణ హత్య కేసులో నిందితుడి గురించి. అవును, ఎలాంటి ఆధారాలు లేకుండా మిస్టరీగా మారిన ఈ కేసును.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన సమాచారంతో తేల్చారు ఎస్‌వోటీ పోలీసులు. అనుమానంతో విచారణ కోసం వెళితే.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చెప్పిన ఆ వివరాలు చూస్తే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అనే చెప్పాలి. అసలేం జరిగింది.. నిందితుడు ఆ చిన్నారిని ఎందుకు చంపాడు.. పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చిన్నారిని హతమార్చిన బాలుడు వయసు పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు. వీడు 10వ తరగతి చదువుతున్నాడు. కానీ, చోరీ కోసం పెద్ద ప్లానే వేశాడు. 80 వేలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పేపర్‌పై స్కెచ్ కూడా గీశాడు. వచ్చి రాని ఇంగ్లీష్‌లో తన మాస్టర్ ప్లాన్ వివరాలు రాసుకున్నాడు. ఈ క్రమంలోనే అన్నెంపున్నెం ఎరుగని అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. చిన్నారిని చంపేసిన అనంతరం బాలుడు సదరు బిల్డింగ్ నుంచి దూకి పక్కన బిల్డింగ్‌లో దాదాపు 15 నిమిషాలు దాక్కున్నాడు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించక పోలీసులు తలపట్టుకుంటున్న వేళ.. ఈ దాక్కున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఈ బాలుడు దాక్కున్న విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ బాలుడిని విచారించేందుకు వారి ఇంటికి వెళ్లగా.. అక్కడ అతను లేడు. స్కూల్‌కి వెళ్లాడని చెప్పారు. పోలీసులు వెంటనే స్కూల్‌కి వెళ్లారు. అక్కడ బాలుడు.. పోలీసులను గమనించి బెదిరిపోయాడు. పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బాలిక హత్య గురించి విచారించగా.. తనకేమీ తెలియదంటూ బుకాయించాడు. ఎంత అడిగినా ఏమీ చెప్పకపోవడంతో.. బాలుడిని తన ఇంటికి తీసుకొచ్చి ఇల్లంతా తనిఖీలు నిర్వహించారు. దాంతో అసలు వ్యవహారం బయటపడింది. బాలుడి ఇంట్లో లెటర్, కత్తి, రక్తంతో కూడిన దుస్తులను ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసింది బాలుడే అని నిర్ధారించుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీటి ఆధారంగా బాలుడ్ని పోలీసులు విచారించగా.. జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు.
అసలేం జరిగింది..?
నిందితుడు తాను రూ. 80 వేలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఒక ప్లాన్ వేసుకున్నాడు. చోరీ చేయడానికి ఎలాంటి స్టెప్స్ వేయాలనేది ఒక పేపర్‌పై రాసుకున్నాడు. దాని ప్రకారం.. మృతురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. దేవుడి పటాల వద్ద ఉన్న హుండీని పగలగొట్టాడు. ఇంట్లో నుంచి శబ్ధం రావడంతో అమ్మాయి వచ్చింది. నిందితుడిని చూసి.. చోరీ గురించి తన తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు.. ఆ బాలికపై దాడి చేశాడు. దాంతో ఆమె కింద పడిపోయింది. అలా కింద పడిపోయిన బాలికపై బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో అటాక్ చేశాడు. మెడపై, పొట్టలో కొత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాలిక చనిపోగానే.. బాలుడు ఆ ఇంటి నుంచి పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి దూకాడు. ఇది ఓ వ్యక్తి చూశాడు. అయితే, అతను దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఆడుకుంటున్నారని భావించాడు. కానీ, చిన్నారి హత్య ఉదంతం వెలుగులోకి రావడంతో.. సదరు వ్యక్తి తాను చూసిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ఎట్టకేలకు ఎవరనేది తేలింది.
నిందితుడు చదివేది పదోతరగతే అయినా.. చోరీ కోసం పక్కా పథకాన్ని రచించాడు. ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. చోరీ ఎలా చేయాలి.. చోరీ తరువాత ఎలా బయటపడాలనే వివరాలను చాలా స్పష్టంగా రాసుకున్నాడు. అంతేకాదు.. డౌట్ రాకుండా ఉండేందుకు చోరీ చేసిన ఇంటిని ధ్వంసం చేయాలని కూడా భావించాడు. మరి బాలుడు తన లేఖలో ఏం రాశాడో చూద్దాం.
లేఖలో సంచలన విషయాలు..
‘మిషన్ డాన్’ పేరుతో నిందితుడు తన చోరీ ప్లాన్‌ను పేపర్‌పై రాసుకున్నాడు. ‘ముందుగా ఇంట్లోకి ప్రవేశించాలి. ఇంట్లో ఉన్న గ్యాస్, టేబుల్‌ని డోర్ వద్ద పెట్టాలి. ఇంటికి వేసిన లాక్‌ను గ్యా్స్‌పై మండించాలి. ఆ తరువాత లాక్‌ను కట్ చేయాలి. లాక్‌ను కట్ చేసిన తరువాత డబ్బులు తీసుకోవాలి. ఆ తరువాత ఇంటికి లాక్ వేయాలి. ఆ తరువాత గ్యాస్‌ను మునుపటి స్థానంలో పెట్టాలి. గ్యాస్‌ను లీక్ చేయాలి. ఆ ఇంటి నుంచి బటయకు వచ్చి లాక్ వేయాలి.’ ఇదీ వాడు పేపర్‌పై రాసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్. చివరిలో గ్యాస్ లీక్ చేయడం ద్వారా.. ఆ ఇల్లు ధ్వంసం అవుతుందని.. తద్వారా తనపై అనుమానం రాదని కేటుగాటు భావించాడు. ఈ పేపర్‌ను చూసి.. అందులో నిందితుడు రాసిన అంశాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు.